Omicron Variant: ఒమిక్రాన్.. డెల్టాను మించి వ్యాపిస్తుందా?

ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా భారత్‌లో డెల్టా వేరియంట్ సృష్టించిన విలయాన్ని ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు. ఈ లోపే ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. అయితే ఈ కొత్త వేరియంట్ డెల్టాను మించి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి.

Published : 02 Dec 2021 01:45 IST

వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..?

జోహెన్నస్‌బర్గ్: ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా భారత్‌లో డెల్టా వేరియంట్ సృష్టించిన విలయాన్ని ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు. ఈ లోపే ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. అయితే ఈ కొత్త వేరియంట్ డెల్టాను మించి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి. ఆ ఆస్కారం లేకపోలేదని దక్షిణాఫ్రికాకు చెందిన కమ్యూనికబుల్ డిసీజెస్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ అడ్రియన్ పూరెన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

‘ అంచనాలకు తగ్గట్టే డెల్టాను మించి ఒమిక్రాన్ వ్యాపిస్తే.. కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంది. దాంతో వైద్యసేవలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. టీకాలు, ఇన్ఫెక్షన్ల కారణంగా వచ్చిన రోగనిరోధక శక్తిని ఈ కొత్త వేరియంట్ ఏమేరకు ఏమార్చగలదో నాలుగు వారాల్లోగా శాస్త్రవేత్తలు తెలుసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అలాగే ఇతర వేరియంట్ల కంటే తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయో లేదో గుర్తించాలన్నారు. 

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్‌ బాధితుల్లో స్వల్పస్థాయి లక్షణాలు కనిపించినట్లు అక్కడి వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంపై ఇప్పుడే ఒక అంచనాకు రావొద్దని వైద్య నిపుణులు సూచించారు. అలాగే ఆ దేశంలోని గాటెంగ్ ప్రావిన్స్‌లో వేగంగా కేసులు పెరుగున్న నేపథ్యంలో.. డెల్టాను ఈ వేరియంట్‌ భర్తీ చేసిందనే వాదనపై ఒక అభిప్రాయానికి రావడం కూడా తొందరపాటే అవుతుందని పూరెన్ అన్నారు .

ఇదిలా ఉండగా.. డెల్టా వేరియంట్ కారణంగా దక్షిణాఫ్రికా ఇప్పటికే కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొంది. ఆ సమయంలో గరిష్ఠంగా ఒక్కరోజే 26 వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇప్పుడు ఒమిక్రాన్ నాలుగో వేవ్‌కు కారణమవుతుందనే అంచనాలు వెల్లడవుతున్నాయి. వేగంగా పెరుగుతున్న కేసులే ఆ ఆందోళనకు కారణం. మరోపక్క, దేశవ్యాప్తంగా కొత్త కేసులు పెరుగుతున్నాయని, ఒమిక్రాన్ కంటే ముందే ఈ కేసుల్లో పెరుగుదల  కనిపిస్తోందని మరో వైద్య నిపుణుడు పేర్కొన్నారు. ఆ దేశంలో ఇప్పటివరకు సుమారు 30 లక్షల కొత్త కేసులు, 89 వేలకు పైగా మరణాలు సంభవించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని