Omicron: 20 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్‌..!

ప్రపంచ దేశాలకు మరో ముప్పుగా మారిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ స్వల్ప కాలంలోనే మరిన్ని దేశాలకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌ ఇప్పటికే 20 దేశాలకు

Updated : 01 Dec 2021 23:22 IST

వైరస్‌ కట్టడికి ఉపక్రమించిన దేశాలు

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలకు మరో ముప్పుగా మారిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ స్వల్ప కాలంలోనే మరిన్ని దేశాలకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌ ఇప్పటికే 20 దేశాలకు విస్తరించినట్లు సమాచారం. అంతేకాకుండా ఆయా దేశాల్లో ఇప్పటికే రెండు వందలకుపైగా ఒమిక్రాన్‌ కేసులు బయటపడినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. వేగంగా విస్తరిస్తోన్న ఈ వేరియంట్‌ వల్ల రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన దేశాలు విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి.

‘ప్రమాదకర వేరియంట్‌గా భావిస్తోన్న ఒమిక్రాన్‌ నిన్నటి వరకు 18 దేశాలకు వ్యాప్తించింది. తాజాగా అది 20 దేశాలకు పెరిగింది. ఇప్పటివరకు 226 కేసులు నమోదయ్యాయి. స్వల్ప కాలంలోనే ఈ సంఖ్య మరింత పెరగడం మీరు చూడవచ్చు. అయినప్పటికీ ఇంతవరకూ ఈ వేరియంట్‌ అమెరికాలో వెలుగు చూడలేదు’ అని అమెరికా అధ్యక్షుడి చీఫ్‌ మెడికల్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ ఆంటోని ఫౌచీ పేర్కొన్నారు. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు. అయితే, ఈ వేరియంట్‌ వ్యాప్తి, తీవ్రత ఏమేరకు ఉందనే అంశంపై అధ్యయనాలు కొనసాగుతున్నాయని.. వాటి పూర్తి సమాచారం వచ్చిన తర్వాతే ఈ వేరియంట్‌ ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయగలమని చెప్పారు.

ఇక ఒమిక్రాన్‌ వేరియంట్‌ తొలుత వెలుగు చూసినట్లు ప్రకటించిన దక్షిణాఫ్రికాలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నవంబర్‌ మూడోవారంలో నిత్యం 300 కేసులు నమోదుకాగా ప్రస్తుతం అది 3 వేలకు చేరింది. వాటిలో అత్యధికం ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉంటున్నట్లు అక్కడి నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రపంచంలోనే కొవిడ్‌ వేగంగా విస్తరిస్తోన్న ప్రాంతాల్లో దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరింది. అదే సమయంలో ఆఫ్రికా దేశాల నుంచి ఇతర దేశాలకు కూడా ఈ వేరియంట్‌ వేగంగా విస్తరిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని