Omicron Effect: వచ్చే రెండు నెలల్లో.. స్వల్ప స్థాయిలో థర్డ్‌వేవ్‌!

వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలల్లో మన దేశంలో స్వల్ప స్థాయిలో థర్డ్‌వేవ్‌ కనిపించనుందని.. ఫిబ్రవరిలో గరిష్ఠ స్థాయిని చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ మనీంద్ర అగర్వాల్‌ అంచనా వేశారు.

Published : 06 Dec 2021 01:30 IST

ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ మనీంద్ర అగర్వాల్‌ అంచనా

దిల్లీ: డెల్టా ప్రభావంతో వణికిపోతోన్న ప్రపంచ దేశాలను కొత్త రూపంలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ మరోసారి కలవరపెడుతోంది. వేగంగా విస్తరిస్తోన్న ఈ వేరియంట్‌ ప్రభావంతో రానున్న రోజుల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని ఇప్పటికే ఆయా దేశాలు అంచనాలు వేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలల్లో మన దేశంలో స్వల్ప స్థాయిలో థర్డ్‌వేవ్‌ కనిపించనుందని.. ఫిబ్రవరిలో గరిష్ఠ స్థాయిని చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ మనీంద్ర అగర్వాల్‌ అంచనా వేశారు.

‘భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య వచ్చే ఏడాది తొలి మాసంలో గరిష్ఠానికి చేరుకోవచ్చు. అదే సమయంలో పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైరస్‌ కట్టడి చర్యల ద్వారా మూడోవేవ్‌ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు’ అని దేశంలో మహమ్మారి ప్రభావాన్ని గణితశాస్త్రపరంగా అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తోన్న సూత్ర మోడల్‌ను రూపొందించిన మనీంద్ర అగర్వాల్‌ పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఉన్న ఆధారాలను బట్టి చూస్తే వచ్చే ఏడాది ప్రారంభంలోనే స్వల్ప స్థాయిలో థర్డ్‌వేవ్‌ కనిపించవచ్చని మనీంద్ర అగర్వాల్‌ వెల్లడించారు. గతంలో డెల్టా ప్రభావం చూపించినప్పుడు మాదిరిగానే రాత్రిపూట కర్ఫ్యూ, జనసమూహాలను నియంత్రించడం వంటి ఆంక్షల ద్వారా దీని తీవ్రతను నియంత్రించవచ్చని సూచించారు. దీంతో మూడోవేవ్‌లో గరిష్ఠంగా పెరిగే కేసులను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. ఒమిక్రాన్‌కు సంక్రమణ సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అందుకే కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి వెళ్లినప్పటికీ ఆస్పత్రుల్లో చేరికలు మాత్రం తక్కువగానే ఉండవచ్చని అంచనా వేశారు. దేశంలో థర్డ్‌వేవ్‌ ఖాయమన్న ఆయన.. అది ఏమేరకు ప్రభావాన్ని చూపుతుందనే విషయం ప్రభుత్వాలు తీసుకునే కట్టడి చర్యలపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని