India Vs Pakistan: భారత సైనికులు మరణిస్తుంటే.. పాకిస్థాన్‌తో టీ20 ఆడతారా?

సరిహద్దుల్లో పాకిస్థాన్‌ చర్యల వల్ల భారత సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే ఆ దేశంతో టీ20 ఆడతారా? అని ఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు.

Updated : 19 Oct 2021 16:35 IST

ప్రధాని మోదీపై ఒవైసీ విసుర్లు

హైదరాబాద్‌: సరిహద్దుల్లో పాకిస్థాన్‌ చర్యల వల్ల భారత సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే ఆ దేశంతో టీ20 ఆడతారా? అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రధాని మోదీని ప్రశ్నించారు. అంతేకాకుండా దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, సరిహద్దుల్లో చైనా ఆక్రమణలపై ప్రధాని ఎందుకు మాట్లాడం లేదన్నారు. చైనా గురించి మాట్లాడాలంటే మోదీకి భయమని ఒవైసీ విమర్శించారు.

‘జమ్మూకశ్మీర్‌లో గత కొంతకాలంగా జరుగుతోన్న ఉగ్ర దాడుల్లో ఇప్పటివరకు తొమ్మిదిమంది సైనికులు అమరులయ్యారు. భారత పౌరుల జీవితాలతో పాకిస్థాన్‌ నిత్యం 20-20 ఆడుతోంది. ఇలాంటి సమయంలో అక్టోబర్‌ 24న పాకిస్థాన్‌తో భారత్‌ టీ20 మ్యాచ్‌ ఆడబోతోంది. సైనికులు మరణిస్తున్నా పాకిస్థాన్‌తో టీ20 ఆడతారా?’ అని ఒవైసీ ప్రశ్నించారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వ వైఫల్యం వల్లే జమ్మూ కశ్మీర్‌లో సామాన్య పౌరుల హత్యలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. ఈ సమయంలో కేంద్ర హోంమంత్రి, ఇంటెలిజెన్స్‌ బ్యూరోలు ఏం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మరోవైపు దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దేశ రాజధానితో పాటు పలు నగరాల్లో లీటరు పెట్రోల్‌ రూ.110కి చేరగా.. డీజిల్‌ ధరలు కూడా వంద దాటాయి. అయినప్పటికీ ఈ రెండు అంశాలపై ప్రధాని మోదీ మౌనంగా ఉంటున్నారని ఒవైసీ విమర్శలు గుప్పించారు.

గతకొన్ని రోజులుగా కశ్మీర్‌లో సాధారణ ప్రజలపై ఉగ్రదాడులు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వచ్చిన కూలీలను శ్రీనగర్‌, పుల్వామా జిల్లాల్లో ఉగ్రవాదులు హత్యచేశారు. ఇలా గడిచిన నాలుగు వారాల్లోనే ఐదుగురు స్థానికేతరులను ఉగ్రవాదులు చంపేయడం అక్కడి వలస కూలీల్లో ఆందోళనకు కారణమవుతోంది. ముఖ్యంగా చిరు వ్యాపారులు, వలస కూలీలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేస్తుండడంతో ఇతర రాష్ట్రాల ప్రజలు తిరిగి వారి స్వస్థలాలకు పయనమవుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని