BRICS Summit 2021: మోదీ అధ్యక్షతన.. భేటీ కానున్న బ్రిక్స్‌ దేశాధినేతలు!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన BRICS శిఖరాగ్ర సదస్సు ఈ గురువారం (సెప్టెంబర్‌ 9న) జరుగనుంది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

Published : 06 Sep 2021 23:45 IST

అఫ్గాన్‌, కొవిడ్‌ పరిణామాలపైనే సభ్య దేశాల ప్రధాన దృష్టి

దిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన BRICS శిఖరాగ్ర సదస్సు ఈ గురువారం (సెప్టెంబర్‌ 9న) జరుగనుంది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. వర్చువల్‌ పద్ధతిలో జరుగనున్న ఈ సమావేశంలో అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించడంతోపాటు కొవిడ్‌ మహమ్మారిపై సంయుక్త పోరులో భాగంగా సభ్య దేశాలు ఓ ఉమ్మడి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సెప్టెంబర్‌ 9 (2021)న జరిగే 13వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సును భారత్‌ నిర్వహిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తుండగా.. 2016లో జరిగిన సదస్సుకు తొలిసారి మోదీ అధ్యక్షత వహించారు. మొత్తంగా భారత్‌ మూడోసారి (2012తో కలిపి) ఈ సదస్సుకు నేతృత్వం వహిస్తోంది. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా, బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సనారో పాల్గొననున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై అన్ని దేశాల మధ్య సమన్వయ సహకారం ఉండాలని భారత్‌ కోరుకుంటోంది. ఇందులో భాగంగా బహుముఖ వ్యవస్థ, ఉగ్రవాద వ్యతిరేకత, సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనకు డిజిటల్‌ సాంకేతికత వినియోగం వంటి విషయాల్లో సంస్కరణలే ప్రధాన అజెండాగా భారత్‌ పేర్కొంటోంది. వీటితో పాటు కొవిడ్‌ ప్రభావం, మహమ్మారిపై సంయుక్త పోరు వంటి అంశాలపైనా బ్రిక్స్‌ సభ్య దేశాలు దృష్టిపెట్టే అవకాశం ఉన్నట్లు విదేశాంగశాఖ వెల్లడించింది.

ఇదిలాఉంటే, అభివృద్ధి చెందుతున్న ఐదు పెద్ద దేశాలైన బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు - BRICS గా ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని మొత్తం జనాభాలో 41శాతం ఈ ఐదు దేశాల్లోనే ఉంది. అంతేకాకుండా ప్రపంచ జీడీపీలో ఈ ఐదు దేశాల వాటా 24శాతం కావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని