Veer Savarkar: గాంధీ సూచనల మేరకే.. వీర్ సావర్కర్ అలా చేశారు!

మహాత్మా గాంధీ సూచనల మేరకే  వీర్‌ సావర్కర్‌ క్షమాభిక్ష లేఖలు రాశారని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Published : 13 Oct 2021 23:06 IST

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

దిల్లీ: ‘స్వాతంత్ర్య సమరయోధుడు వీర్‌ సావర్కర్‌ గురించి అసత్యాలు వ్యాప్తిలో ఉన్నాయి. జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఎన్నో క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేశారనే వాదనలు ఉన్నాయి. అయితే, మహాత్మా గాంధీ సూచనల మేరకే  వీర్‌ సావర్కర్‌ ఆ లేఖలు రాశారు’ అని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా కేవలం మార్క్సిస్ట్‌, లెనినిస్ట్‌ భావజాలం కలిగిన వ్యక్తులే ఆయనను నియంతృత్వవాది అని తప్పుగా వక్రీకరించారని ఆరోపించారు. వీర్‌ సావర్కర్‌ జీవితంపై రాసిన ఓ పుస్తకం విడుదల సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

వీర్‌ సావర్కర్‌ని బలమైన జాతీయవాదిగా పేర్కొన్న రాజ్‌నాథ్‌ సింగ్‌... 20వ శతాబ్దంలో భారతదేశపు తొలి సైనిక వ్యూహకర్తగా అభివర్ణించారు. వీర్ సావర్కర్‌ గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ఆయనను తక్కువ చేసి చూపడం సముచితం కాదన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో చిత్తశుద్ధితో పోరాడిన ఆయనకు ఆంగ్లేయులు రెండుసార్లు జీవితఖైదు విధించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో సావర్కర్‌ జీవితంపై కష్టపడి పరిశోధనలు కొనసాగిస్తూ విశ్లేషణాత్మక ప్రచురణలు రావడం గొప్ప విషయమని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సంతోషం వ్యక్తం చేశారు.

చరిత్రను వక్రీకరిస్తున్నారు...

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. చరిత్రను వక్రీకరించేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శలు గుప్పించారు. ఇదే కొనసాగితే జాతిపితగా మహాత్మగాంధీని తొలగించి.. ఆ స్థానంలో సావర్కర్‌ను ప్రకటిస్తారని ఆరోపించారు. మహాత్మా గాంధీ హత్యకేసులో నిందితుడిగా ఉన్న సావర్కర్‌పై కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఒవైసీ అభిప్రాయపడ్డారు.

ఓ బ్రిటీష్‌ అధికారి హత్య కేసులో వీర్‌ సావర్కర్‌ పాత్ర ఉన్నట్లు అప్పటి ప్రభుత్వం ఆరోపించింది. ఆ కారణంగా ఆయనకు 1911లో జీవితఖైదు విధించింది. దీంతో వీర్‌ సావర్కర్‌ దాదాపు దశాబ్ద కాలం అండమాన్‌ జైల్లో (కాలాపానీ) గడపాల్సి వచ్చింది. అదే సమయంలో క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్‌ అధికారులకు సావర్కర్‌ లేఖలు రాశారు. తాజాగా ఇదే విషయం మరోసారి చర్చనీయాంశమయ్యింది. ఇదిలాఉంటే, గాంధీ హత్య కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలపై 1949లో సావర్కర్‌ అరెస్టయ్యారు. అందుకు తగిన ఆధారాలు లభించకపోవడంతో కొన్నిరోజులకే ఆయన నిర్దోషిగా విడుదలైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని