Kiren Rijiju: న్యాయమూర్తులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు ఆందోళనకరం: కిరణ్‌ రిజిజు

సామాజిక మాధ్యమాలతోపాటు ఇతర వేదికలపై న్యాయమూర్తులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు.

Published : 09 Nov 2021 21:42 IST

దిల్లీ: సామాజిక మాధ్యమాలతో పాటు ఇతర వేదికలపై న్యాయమూర్తులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. న్యాయమూర్తుల జీవితం, వారు పడే కష్టాన్ని చాలా మంది అర్థం చేసుకోలేరని అభిప్రాయపడ్డారు. శాసన, న్యాయవ్యవస్థలు ఒకదానిపై మరొకరి నియంత్రణ కోసం పోరాడడం లేదన్న ఆయన.. దేశాన్ని బలమైన ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దేందుకు ఇరు వ్యవస్థలు ఒకే విధంగా పాటుపడుతాయని అన్నారు.

‘న్యాయమూర్తులు ఏం చేస్తారో మాకు తెలుసు. కానీ, చాలా మందికి జడ్జీల జీవితం ఎలా ఉంటుందో అర్థం కాదు. సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. న్యాయమూర్తులను దగ్గరగా చూస్తే.. వారు ఎంత శ్రమిస్తారో మనలాంటి వారికి అర్థం చేసుకోవడం చాలా కష్టం’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అభిప్రాయపడ్డారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (NALSA) నోయిడాలోని శారదా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఈ విధంగా మాట్లాడారు.

‘ప్రజాజీవితంలో ఉన్నాం కాబట్టి మనం బహిరంగంగా మాట్లాడుతాం. కానీ, న్యాయమూర్తులకు ఆ అవకాశం ఉండదు. ముఖ్యంగా రోజువారీ విధుల నుంచి వచ్చి న్యాయ సహాయం చేయడం వారికి అంత సులువు కాదు’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి పేర్కొన్నారు. కనీస న్యాయం పొందడంలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదనేదే శాసన, న్యాయ వ్యవస్థల అభిప్రాయమని.. ఇందుకు ఇరు వ్యవస్థలు తమదైన రీతిలో ప్రయత్నం చేస్తాయని అన్నారు. ఇక దేశవ్యాప్తంగా కింది కోర్టుల్లో మొత్తం 4 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేసిన ఆయన.. ప్రస్తుతం కింది కోర్టులపైనే అధిక ఒత్తిడి నెలకొందని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని