Road Accident: లోయలో పడిన బస్సు.. 9 మంది దుర్మరణం

జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలో పడటంతో అందులో ప్రయాణిస్తున్న 8 మంది దుర్మరణం పాలయ్యారు.

Updated : 28 Oct 2021 15:45 IST

ప్రధాని మోదీ, అమిత్‌ షా విచారం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దోడా జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోవడంతో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న సైన్యం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతోంది. ప్రయాణికులతో థత్రీ నుంచి దోడా వైపు వెళ్తుండగా సూయీగౌరీ ప్రాంతం వద్ద ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. దీంతో బస్సు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో వ్యక్తి ప్రాణాలు విడిచారు. 

మోదీ, షా దిగ్భ్రాంతి

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు మోదీ ట్విటర్‌లో ట్వీటర్‌లో తెలిపారు. మృతులకు ప్రధాని సహాయక నిధి నుంచి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. మరోవైపు, అమిత్‌షా జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాకు ఫోన్‌ చేసి మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని