Covid Orphans: పీఎంకేర్స్‌.. అనాథ చిన్నారుల పథకానికి 5వేల దరఖాస్తులు!

దేశంలో కొవిడ్‌ విలయం కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత పిల్లలను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎంకేర్స్‌ చిన్నారుల పథకానికి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5491 దరఖాస్తులు వచ్చినట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ వెల్లడించింది.

Published : 03 Dec 2021 21:11 IST

కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ వెల్లడి

దిల్లీ: దేశంలో కొవిడ్‌ విలయం కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత పిల్లలను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎంకేర్స్‌ చిన్నారుల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5491 దరఖాస్తులు వచ్చినట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ వెల్లడించింది. వీటిలో ఇప్పటికే 3049 దరఖాస్తులు ఆమోదించినట్లు తెలిపింది. కొవిడ్‌ కారణంగా అనాథలుగా మారిన చిన్నారులకు ఆర్థిక భరోసాపై లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది.

‘కొవిడ్‌-19 బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలపై డిసెంబర్‌ 2 తేదీ నాటికి pmcaresforchildren.in పోర్టల్‌ ద్వారా 5491 దరఖాస్తులు వచ్చాయి. విచారణ జరిపిన అనంతరం వీటిలో ఇప్పటికే 3049 దరఖాస్తులు జిల్లా మేజిస్ట్రేట్‌ల ఆమోదం పొందాయి. మరో 483 దరఖాస్తులు ఆమోదం కోసం సిద్ధంగా ఉన్నాయి’ అని కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ స్మృతీ ఇరానీ లోక్‌సభలో వెల్లడించారు.

ఇదిలాఉంటే, కరోనా బారినపడి తల్లిదండ్రులకు దూరమై అనాథలుగా మారిన పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పథకం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా అనాథ పిల్లల పేరిట కొంత సొమ్ము డిపాజిట్‌ చేసి వారికి 18 ఏళ్లు నిండిన తర్వాత మూలనిధి రూ.10లక్షలు అందేలా ఈ ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. ఈ క్రమంలో 18 ఏళ్ల నుంచి 23 ఏళ్ల వరకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఐదేళ్ల పాటు వ్యక్తిగత అవసరాలకు దీని నుంచి నెలవారీగా కొంత స్టైపండ్‌ రూపంలో అందిస్తుంది. 23 ఏళ్లు నిండిన తర్వాత వ్యక్తిగత లేదా వృత్తిపరమైన అవసరాలకు ఈ మొత్తం రూ.10లక్షలు వినియోగించుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మే 29న మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని