
ParamBirSingh: ఎట్టకేలకు పరంబీర్ ప్రత్యక్షం..!
మాజీ పోలీస్ కమిషనర్ తీరును తప్పుపట్టిన మహారాష్ట్ర హోంమంత్రి
ముంబయి: ఓ సీనియర్ ఐపీఎస్ అధికారే ‘ప్రాణహాని’ ఉందంటూ పేర్కొనడం షాక్‌కు గురిచేసిందని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ పేర్కొన్నారు. గతంలో ముంబయి, ఠాణెలకు కమిషనర్‌గా పనిచేసిన పరంబీర్ సింగ్ ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రాణహాని ఉందని న్యాయస్థానానికి మొరపెట్టుకొన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర హోంమంత్రి స్పందించారు. ఇదే సమయంలో గతకొన్ని నెలలుగా పరారీలో ఉన్న పరంబీర్ చివరకు గురువారం ఉదయం ముంబయిలో ప్రత్యక్షమయ్యారు. ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు హాజరైన ఆయన.. తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ పలు ఆరోపణలు చేశారు. ఆ తర్వాత పరంబీర్‌పై కూడా వసూళ్ల ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన్ను ముంబయి పోలీస్ కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించారు. నాటి నుంచి ఆయన ఆచూకీ లేదు. ఈ క్రమంలోనే ఆయన దేశం విడిచి పారిపోయారనే ప్రచారం జరిగింది. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న పరంబీర్ కోర్టు విచారణలకు హాజరు కాలేదు. దీంతో ఆయన్ను పరారీలో ఉన్న నేరస్థుడిగా బాంబే మెజిస్ట్రేట్ కోర్టు ఇటీవల ప్రకటించింది. మరోవైపు కేసుల దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించిన నేపథ్యంలోనే పరంబీర్ సింగ్ ముంబయి చేరుకున్నారు.
ఇదిలాఉంటే, బలవంతపు వసూళ్ల కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ తరపున ఆయన న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, తొలుత ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాకరించింది. ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ వివరాలు చెప్పేంత వరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టబోమని, రక్షణ కల్పించబోమని స్పష్టం చేసింది. దీంతో దిగివచ్చిన పరంబీర్ సింగ్ తనకు ప్రాణహాని ఉందని.. ప్రస్తుతం ఛండీగఢ్‌లో ఉన్నానని ప్రకటించారు. తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తే కోర్టు విచారణకు హాజరవుతానని హామీ ఇచ్చారు. ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు వెల్లడించిన సర్వోన్నత న్యాయస్థానం.. కేసుల దర్యాప్తునకు మాత్రం తప్పనిసరిగా సహకరించాలని ఆదేశించింది. దీంతో పరంబీర్ సింగ్ ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు హాజరయ్యారు.
ఇవీ చదవండి
Advertisement