Taliban: అఫ్గాన్‌ పరిణామాలపై భారత్‌ చర్చ.. స్వాగతించిన తాలిబన్లు!

గతకొంత కాలంగా అఫ్గాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై ఎనిమిది దేశాలతో భారత్‌ జరిపిన చర్చలను తాలిబన్లు స్వాగతించారు.

Published : 12 Nov 2021 14:51 IST

ప్రపంచ దేశాలకు ఆందోళన అక్కర్లేదని మరోసారి హామీ

కాబుల్‌: గతకొంత కాలంగా అఫ్గాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై ఎనిమిది దేశాలతో భారత్‌ జరిపిన చర్చలను తాలిబన్లు స్వాగతించారు. అంతేకాకుండా అఫ్గాన్‌ వేదికగా ఇతర దేశాలకు ఎటువంటి ముప్పు వాటిల్లదని ప్రపంచ దేశాలకు మరోసారి హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌లో జరిగిన సమావేశంలో పలు దేశాలు ప్రస్తావించిన అంశాలను ఇప్పటికే నెరవేర్చినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ అఫ్గాన్‌ సంక్షోభ నివారణకు భారత్‌ జరిపిన చొరవను తాలిబన్లు ప్రశంసించారు.

‘భారత్‌లో జరిగిన సమావేశాన్ని ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌(అఫ్గానిస్థాన్‌) స్వాగతిస్తోంది. పరిపాలన విషయంలో ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ నేల నుంచి ఏ దేశంపైనా వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతాయని ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అని అఫ్గాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇనాముల్లా పేర్కొన్నారు. అయినప్పటికీ అన్ని దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తాలిబన్లు చెప్పిన విషయాన్ని అక్కడి వార్తాసంస్థ వెల్లడించింది.

ఇదిలాఉంటే, తాలిబన్ల ఆక్రమణ తర్వాత అఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు కేవలం ఆ దేశానికే కాకుండా సరిహద్దు దేశాలకూ చిక్కులు కలిగించేవేనని దిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆఫ్గాన్‌ పరిస్థితులపై ప్రాంతీయ దేశాలు పరస్పర సహకారం, సమన్వయం, సంప్రదింపులతో ముందుకెళ్లాల్సిన సమయమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉగ్రవాద ముప్పు, వాటి వల్ల ఇతర దేశాలపై పడే ప్రభావం, డ్రగ్స్‌ రవాణా వంటి వాటిని అరికట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను ఎనిమిది దేశాల జాతీయ భద్రతా సలహాదారులు చర్చించారు. ఆ సమావేశానికి మధ్య ఆసియాలోని కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, తజికిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ సహా రష్యా, ఇరాన్‌ల జాతీయ భద్రత సలహాదారులు పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశానికి చైనా, పాకిస్థాన్‌లను భారత్ ఆహ్వానించినప్పటికీ ఆ రెండు దేశాలు వేర్వేరు కారణాలు చెబుతూ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని