Talibans to UN: అంతర్జాతీయ వేదికపై.. మాకూ అవకాశం ఇవ్వండి..!

ఐక్యరాజ్య సమితి వార్షిక సర్వసభ్య సమావేశంలో తమ ప్రతినిధి ప్రసంగించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ తాలిబన్‌ ప్రతినిధులు ఐరాస చీఫ్‌కు లేఖ రాశారు.

Updated : 22 Sep 2021 15:14 IST

ఐరాస చీఫ్‌కు తాలిబన్ల విజ్ఞప్తి

న్యూయార్క్‌: అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనంతరం తాము సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పుకొంటున్న తాలిబన్లు.. అంతర్జాతీయ సమాజం గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం జరుగుతోన్న ఐక్యరాజ్య సమితి వార్షిక సర్వసభ్య సమావేశంలో తమ ప్రతినిధి ప్రసంగించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఐరాస చీఫ్‌కు లేఖ రాశారు. ఈ లేఖ విషయాన్ని ఐరాస అధికార ప్రతినిధులు ధ్రువీకరించారు.

ప్రస్తుతం కొనసాగుతోన్న ఐరాస సర్వసభ్య సమావేశంలో తమ రాయబారి ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వాలని తాలిబన్‌ విదేశాంగశాఖ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీ ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఐరాసలో తమ ప్రతినిధిగా సుహైల్‌ షహీన్‌ను నామినేట్‌ చేసిన విషయాన్ని అందులో పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే తాలిబన్లకు ముందున్న (అఫ్రాష్‌ ఘనీ) ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహిస్తోన్న గులాం ఇసాక్జాయ్‌ ఇంకా కొనసాగుతున్న అంశాన్ని ప్రస్తావించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం, అఫ్గానిస్థాన్‌ తరపున గులాం ఇసాక్జాయ్‌ ఈ సమావేశాల చివరి రోజున ప్రసంగించే అవకాశం ఉంది. అయితే ఇకపై ఆయన తమ దేశానికి ప్రాతినిధ్యం వహించరని తాలిబన్లు స్పష్టం చేశారు.

తాలిబన్లు రాసిన లేఖను ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ ధ్రువీకరించారు. ఈ అభ్యర్థన లేఖను అమెరికా, చైనా, రష్యాతో పాటు మొత్తం తొమ్మిది సభ్యదేశాలతో కూడిన నిర్ధారణ కమిటీకి పంపించినట్లు వెల్లడించారు. అయితే, వచ్చే సోమవారంతో సమావేశాలు ముగుస్తున్నందున.. అంతకుముందే ఈ కమిటీ భేటీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో తాలిబన్ల రాయబారి అంతర్జాతీయ వేదికపై ప్రసంగించడం అనుమానంగానే కనిపిస్తోంది.

అంతర్జాతీయ వేదికపై గుర్తింపు కోసం ఆరాటపడుతోన్న తాలిబన్లకు ఈ వేదికపై ప్రసంగించడం అత్యంత అవసరమనే చెప్పవచ్చు. ఇప్పటివరకు చైనా, పాకిస్థాన్‌ వంటి దేశాలు మినహా ప్రపంచ దేశాలు తాలిబన్ల ప్రభుత్వాన్ని బహిరంగంగా గుర్తించి వారితో సత్సంబంధాలు నెలకొల్పేందుకు ముందుకు రావడం లేదు. తాలిబన్లు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఆయా దేశాలు ఆచితూచి స్పందించే ధోరణి అవలంభిస్తోన్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని