Taliban warns US: ఆగస్టు 31.. అమెరికా.. ఇదే మీకు రెడ్‌లైన్‌..!

గడువు ముగిసిన తర్వాత అమెరికా బలగాలు ఇంకా అఫ్గాన్‌లోనే ఉంటే పర్యవసానాలు తప్పవని హెచ్చరించారు. ఆగస్టు 31నే వారికి ‘రెడ్‌ లైన్‌’ అని స్పష్టం చేశారు.

Updated : 23 Aug 2021 22:06 IST

గడువు దాటితే పర్యవసానాలు తప్పవని తాలిబన్ల హెచ్చరిక

కాబుల్‌: రెండు దశాబ్దాల సుదీర్ఘ సమయం తర్వాత అఫ్గాన్‌ నుంచి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్దేశించుకుంది. ఇదే సమయంలో తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, తమ బలగాలు, మిత్ర దేశాల పౌరుల తరలింపు ప్రక్రియలో భాగంగా ఈ గడువు పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పేర్కొన్నారు. ఇలాంటి వార్తలపై స్పందించిన తాలిబన్లు.. ఒకవేళ గడువు ముగిసిన తర్వాత అమెరికా బలగాలు ఇంకా అఫ్గాన్‌లోనే ఉంటే పర్యవసానాలు తప్పవని హెచ్చరించారు. ఆగస్టు 31 వారికి ‘రెడ్‌ లైన్‌’ అని స్పష్టం చేశారు. ఇలా ఓ వైపు అమెరికా బలగాల ఉపసంహరణ ప్రక్రియ, మరోవైపు తాలిబన్ల హెచ్చరికల నేపథ్యంలో ఆగస్టు 31న అఫ్గాన్‌లో ఏం జరగబోతోందనే విషయంపై యావత్‌ ప్రపంచం ఆందోళనతో ఉత్కంఠగా చూస్తోంది.

వేల మందిని తరలించడం ఓ సవాల్‌..

అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోతున్న సమయంలోనే ఆ దేశాధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ దేశం విడిచి పారిపోయాడు. అనంతరం స్వల్ప సమయంలోనే తాలిబన్లు దేశం మొత్తాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత అఫ్గాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వివిధ దేశాల పౌరులు, రాయబార కార్యాలయాల సిబ్బందిని స్వదేశాలకు తరలించే ప్రక్రియ ముమ్మరమైంది. ఇందులో భాగంగా అమెరికా కూడా వారి పౌరులతో పాటు మిత్ర దేశాల సిబ్బందిని తరలిస్తోంది. ఇదే సమయంలో అఫ్గాన్‌ పౌరులు కూడా తమను రక్షించాలని వేడుకుంటూ ఎయిర్‌పోర్టులో దిగే ప్రతి విమానం వెనక పరుగులు తీస్తున్నారు. దీంతో కాబుల్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఇతర దేశాల పౌరులను తరలించే ప్రక్రియ సవాల్‌గా మారింది. ప్రస్తుతం కాబుల్‌ ఎయిర్‌పోర్టు మాత్రం 5800 మంది అమెరికా సైనికుల స్వాధీనంలో ఉంది.

ఇలా కాబుల్‌ నుంచి వాయుమార్గంలో భారీగా ప్రజలను తరలించడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. ప్రాణనష్టం లేకుండా ఇది సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా తాలిబన్‌ ఆక్రమిత అఫ్గాన్‌ నుంచి అమెరికన్లను, మిత్రదేశాలకు చెందిన దాదాపు 65వేల మందిని తరలిస్తామని అభయమిచ్చే ప్రయత్నం చేశారు. తాము చేపట్టిన ఈ ఆపరేషన్‌ పూర్తయ్యేవరకూ అఫ్గాన్‌ విడిచివెళ్లే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు. అవసరమైతే ఈ గడువును పొడిగించే అవకాశాలను పరిశీలిస్తున్నామని తాజాగా వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం 28వేల మందిని తరలించగా.. ఇంకా సగం మంది ఉన్నట్లు సమాచారం. ఇలా అమెరికా పౌరులతో పాటు మిత్రదేశాల పౌరుల ధ్రువపత్రాల పరిశీలనలో తీవ్ర జాప్యం జరగడం, కాబుల్‌ ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో తరలింపు ప్రక్రియ మరింత ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.

రెడ్‌లైన్‌ తప్పితే..పర్యవసానాలు తప్పవు

అఫ్గాన్‌ నుంచి ఆగస్టు 31 నాటికి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని అమెరికా ఇదివరకే నిర్దేశించుకుంది. అయితే, అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా బలగాలను పూర్తిస్థాయిలో తరలించడం ఆలస్యం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అమెరికా సేనలను మరికొంత సమయం పాటు అఫ్గాన్‌లోనే ఉంచాలని.. ఇలాంటి వాటిపై చర్చించేందుకు జీ7 దేశాలు అత్యవసరంగా సమావేశం కావాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సూచించారు. ఇలాంటి వార్తల నేపథ్యంలో తాలిబన్లు కూడా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ముందుగా చెప్పినట్లు ఆగస్టు 31 నాటికి వారి బలగాల ఉపసంహరణను పూర్తి చేయాలని పేర్కొన్నారు. లేకుంటే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తాలిబన్‌ ప్రతినిధులు హెచ్చరించారు. ఆగస్టు 31నే వారికి ‘రెడ్‌ లైన్‌’ అని వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్‌ నేతలు స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, అఫ్గాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించే ఆపరేషన్‌ కొనసాగుతోంది. గడిచిన మూడు రోజుల్లోనే దాదాపు వందల మందిని భారత్‌కు తీసుకురాగలిగారు. నిత్యం రెండు విమానాల ద్వారా భారతీయులను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో అక్కడ నెలకొన్న పరిస్థితులను భారత ప్రభుత్వం ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తోందని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు. ఇదే సమయంలో అఫ్గాన్‌ సంక్షోభాన్ని చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అక్కడ నెలకొన్న పరిస్థితులపై అన్ని పార్టీల సభాపక్ష నేతలకు సమాచారం ఇవ్వాలని ప్రధానమంత్రి సూచించినట్లు ఎస్‌ జైశంకర్‌ వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని