COP26: ‘ఇక చాలు’.. మన పతనానికి మనమే దారులు వేసుకుంటున్నాం!

‘ఇక చాలు’ అని చెప్పడానికి సమయం ఆసన్నమైందని.. ప్రస్తుతం మన పతనానికి మనమే దారులు వేసుకుంటున్నామని ఐక్యరాజ్య సమితి చీఫ్‌ ప్రపంచ దేశాలను మరోసారి హెచ్చరించారు.

Published : 01 Nov 2021 20:23 IST

ప్రపంచ దేశాలకు ఐరాస చీఫ్‌ హెచ్చరిక

గ్లాస్గో: ‘ఇక చాలు’ అని చెప్పడానికి సమయం ఆసన్నమైందని.. ప్రస్తుతం మన పతనానికి మనమే దారులు వేసుకుంటున్నామని ఐక్యరాజ్య సమితి చీఫ్‌ ప్రపంచ దేశాలను మరోసారి హెచ్చరించారు. మానవాళిని కాపాడుకుంటూనే పుడమిని రక్షించేందుకు కాప్‌ (COP26) వాతావరణ సదస్సు తక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. బ్రిటన్‌లోని గ్లాస్గో వేదికగా యావత్‌ ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరైన కాప్‌26 సదస్సును ఉద్దేశించి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘ఇక చాలు’ అని చెప్పేందుకు సమయం వచ్చేసింది. జీవవైవిధ్యాన్ని నాశనం చేసింది చాలు. కార్బన్‌తో మనల్ని మనమే ప్రాణాలు తీసుకోవడం ఇక చాలు. ప్రకృతిని మరుగుదొడ్డిగా చూడడం ఇక చాలు. బ్లాస్టింగ్‌, మరింత లోతుగా మైనింగ్‌ చేయడం, వాటిని మండించడం చాలు. ఇలా మన పతనానికి మనమే దారులు వేసుకుంటున్నాం’ అని ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ఇలాంటి చర్యల వల్ల వాతావరణ విపత్తువైపు పయణిస్తున్నామన్న ఆయన.. జీవవైవిధ్యాన్ని దారుణంగా నాశనం చేసే చర్యలను వెంటనే ఆపాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.

భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌ మేర వేడెక్కకుండా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సజీవంగా ఉంచేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని ఐరాస చీఫ్‌ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా 2030 నాటికి ఉద్గారాలను 45శాతం తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాప్‌26ను విజయవంతం చేయాలంటే అన్ని దేశాల నుంచి పూర్తి సహకారం అవసరమని ఉద్ఘాటించారు.

ఇదిలాఉంటే, మానవాళి ఉమ్మడి శత్రువైన భూతాపానికి కళ్లెం వేసి, పుడమిని కాపాడుకోవడానికి గట్టి చర్యలు తీసుకోవాలన్న వినతుల మధ్య (Glasgow Cop26) ఐరాస వాతావరణ సదస్సు ప్రారంభమైంది. నవంబరు 12 వరకు జరిగే ఈ కార్యక్రమానికి 'స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరం వేదికైంది. దాదాపు 200 దేశాల నేతలు, ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. వాతావరణ మార్పులను అదుపు చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తున్నారు. ఈ సదస్సు ప్రారంభ సదస్సుల్లో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఐరాస సెక్రటరీ జనరల్‌ గుటెరస్‌తోపాటు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ని ప్రధాన వేదికపై ఆప్యాయంగా పలుకరించారు. అయితే, ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని