Taliban: తాలిబన్ల ప్రతీకార హత్యలు.. మండిపడ్డ ఐరాస!

తాలిబన్లు ప్రతీకార హత్యలకు పాల్పడుతున్నట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి విశ్వసనీయ సమాచారం తమకు చేరిందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం పేర్కొంది.

Published : 13 Sep 2021 19:12 IST

మానవ హక్కుల ఉల్లంఘనపై ఐరాస ఆందోళన

జెనీవా: అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత తాలిబన్లు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారనే వార్తలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా తాలిబన్లు ప్రతీకార హత్యలకు పాల్పడుతున్నట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి విశ్వసనీయ సమాచారం తమకు చేరిందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం పేర్కొంది. ముఖ్యంగా మునుపటి ప్రభుత్వంలోని అధికారులు, వారి బంధువులను నిర్బంధించడం.. అనంతరం వారిలో కొందరిని హత్య చేస్తున్నట్లు తమకు నివేదికలు అందాయని ఐరాస స్పష్టం చేసింది. తాలిబన్లు చెప్పిన మాటలకు, వారు చేస్తోన్న చర్యలకు పొంతనే లేదని విమర్శించిన ఐరాస.. అఫ్గాన్‌ ప్రజలకు నిజంగా ఇది ఆపత్కాల సమయమేనని ఆందోళన వ్యక్తం చేసింది.

‘మునుపటి ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల కోసం తాలిబన్లు ఇంటింటి గాలింపు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా రక్షణ సిబ్బంది, అక్కడి సంస్థలకు సహకారం అందించిన వారికోసం తాలిబన్లు గాలిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి గాలింపు చర్యలు ఆరు, ఏడు నగరాల్లో చోటుచేసుకోగా.. ఐక్యరాజ్య సమితి సిబ్బందికి కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. ఇది నిజంగా ఆందోళనకర పరిణామమే’ అని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగాధిపతి మిషెల్లీ బషెలెట్‌ పేర్కొన్నారు. అయితే, బందీలుగా చేసిన వారిలో కొందరిని విడిచిపెడుతున్నప్పటికీ.. మరికొందరిని చంపడం నిజంగా ఆందోళనకర విషయమేనని అభిప్రాయపడ్డారు.

మహిళల హక్కులను కాపాడుతామని తాలిబన్లు ఇచ్చిన మాట కూడా ఆచరణలో కనిపించడం లేదని.. ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశంలో మిషెల్లీ బషెలెట్‌ వాపోయారు. గడిచిన మూడు వారాలుగా అక్కడి మహిళలు బహిరంగ ప్రాంతాలకు వెళ్లలేకపోవడం ఇందుకు నిదర్శనమని అన్నారు. ఇక 12ఏళ్ల వయసు పైబడిన బాలికలను పాఠశాలలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని.. అఫ్గాన్‌లో మహిళా వ్యవహారాల విభాగాల్లో కొన్నింటిని నాశనం చేశారని విరుచుకుపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు