Flee from Afghan: అఫ్గాన్‌ నుంచి.. 5లక్షల మంది తప్పించుకునేందుకు సిద్ధం!

అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా అక్కడి నుంచి దాదాపు 5లక్షలకు పైగా అఫ్గాన్‌ పౌరులు దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి శరణార్థ విభాగం (UNHCR) అంచనా వేసింది.

Published : 27 Aug 2021 22:32 IST

ఐరాస శరణార్థ విభాగం అంచనా

జెనీవా: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో కాబుల్‌ నగరంలో జరిగిన ఆత్మాహుతి దాడులతో అక్కడ మరింత భయానక వాతావరణం నెలకొన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో అఫ్గాన్‌ నుంచి దాదాపు 5లక్షలకు పైగా అక్కడి పౌరులు దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి శరణార్థ విభాగం (UNHCR) అంచనా వేసింది. అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లో వీరందరూ దేశం నుంచి తప్పించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు యూఎన్‌హెచ్‌సీఆర్‌ అభిప్రాయపడింది.

‘అఫ్గాన్‌కు చెందిన దాదాపు 22లక్షల మంది ఇప్పటికే వివిధ దేశాల్లో శరణార్థులుగా నమోదు చేసుకున్నారు. దాదాపు వారందరూ పాకిస్థాన్‌, ఇరాన్‌లోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న హింసాత్మక ఘటనలతో పాటు ఎన్నికైన ప్రభుత్వం కూడా కుప్పకూలిపోవడం పౌరులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇది మరింత అస్థిరతకు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లేందుకు కారణమవుతుంది’ అని ఐరాస శరణార్థ విభాగం పేర్కొంది. అంతేకాకుండా అక్కడ చోటుచేసుకున్న అంతర్యుద్ధం కారణంగా కేవలం ఈ ఏడాదిలోనే 5,58,000 మంది స్వదేశంలోనే ప్రాంతాలు మారిపోయారని అంచనా వేసింది. అలా వెళ్లిన ప్రతి ఐదుగురిలో నలుగురు మహిళలు, చిన్నారులే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం స్వదేశంలోనే కాకుండా సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయే వారి సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉందని యూఎన్‌హెచ్‌సీఆర్‌ పేర్కొంది.

ఇలా వరుస సంక్షోభాలను ఎదుర్కొంటున్న అఫ్గాన్‌.. భవిష్యత్తులో చీకటి రోజులు ఎదుర్కొనే అవకాశం ఉందని యూఎన్‌హెచ్‌సీఆర్‌ ఆసియా-పసిఫిక్‌ సీఈఓ నజీబా వాజెదాఫోస్ట్‌ హెచ్చరించారు. ప్రస్తుతం ఇతర విభాగాలతో కలిసి చేపడుతోన్న సహాయ కార్యక్రమాల కోసం దాదాపు 300 మిలియన్‌ డాలర్లు తక్షణ అవసరం అని అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, అఫ్గాన్‌ నుంచి తమ పౌరుల తరలింపు ప్రక్రియను ఆయా దేశాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే బ్రిటన్‌, స్పెయిన్‌ శుక్రవారంతో తమ పౌరులను తరలించే కార్యక్రమాన్ని పూర్తిచేయగా.. జపాన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలు త్వరలోనే ముగిస్తామని ప్రకటించాయి. ఇక గడువు ముగిసేనాటికి భారత్‌ కూడా సాధ్యమైనంత మందిని తరలించే ప్రయత్నం చేస్తోందని భారత విదేశాంగశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని