Booster Shots: అమెరికా కీలక నిర్ణయం.. 18ఏళ్లు దాటిన అందరికీ బూస్టర్‌ డోసు!

కరోనా వైరస్‌ నుంచి ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల పైబడినవారందరికీ బూస్టర్‌ డోసులు ఇచ్చేందుకు నిర్ణయించింది.....

Published : 20 Nov 2021 01:16 IST

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ నుంచి ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల పైబడిన వారందరికీ బూస్టర్‌ డోసులు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఫైజర్, మోడెర్నా బూస్టర్‌ డోసులకు అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతిచ్చింది. గతంలో 65ఏళ్లు పైబడినవారు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారికి మాత్రమే అమెరికా బూస్టర్‌ డోసులను అందించింది. తాజా నిర్ణయంతో 18 ఏళ్లు పైబడిన ఎవరైనా బూస్టర్‌ షాట్ తీసుకునేందుకు అర్హులే. దీంతో కోట్లాది మంది లబ్ధి పొందనున్నారు. శీతాకాలంలో కొవిడ్‌ కేసులు పెరిగే అవకాశాలున్నాయంటూ వస్తోన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘ఆసుపత్రిలో చేరడం, మరణాలు వంటి తీవ్రమైన పరిణామాలు సహా మహమ్మారి నుండి ప్రజలకు నిరంతరం రక్షణ అందించడంలో ఈ నిర్ణయం ఎంతగానో సహాయపడుతుంది’ అని ఎఫ్‌డీఏ తాత్కాలిక కమిషనర్ జానెట్ వుడ్‌కాక్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై మోడెర్నా సీఈఓ స్టెఫాన్ బాన్సెల్ స్పందించారు. ‘శీతాకాలంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు, ఆసుపత్రుల్లో  చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఎంతో ఉపయుక్తం కానుంది’ అని అన్నారు.

ఏ టీకా అయినా తీసుకోవచ్చు

అయితే, రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్‌ డోసు తీసుకునేందుకు ప్రజలు అర్హులు. గతంలో ఏ టీకా తీసుకున్నా.. బూస్టర్‌ షాట్‌గా మరేదైనా కూడా తీసుకోవచ్చు. సింగిల్‌ డోసు టీకా అయిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ తీసుకున్నవారు కూడా బూస్టర్‌ డోసు తీసుకునేందుకు అర్హులే. అమెరికాలో ఇప్పటివరకు 19.5 కోట్ల మంది రెండు డోసులు తీసుకున్నారు. వారిలో 3 కోట్ల మంది ఇప్పటికే మూడో డోసు వేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని