Vijay Mallya: రూ.6వేల కోట్లు అప్పు చేస్తే.. రూ.14వేల కోట్లు జప్తు!

పలు బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకుని పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను ‘దివాలా దారు’గా ప్రకటిస్తూ లండన్‌ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

Updated : 27 Jul 2021 10:28 IST

ఈడీ, బ్యాంకులపై విజయ్‌ మాల్యా ఆరోపణలు

లండన్‌: పలు బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకుని పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను ‘దివాలా దారు’గా ప్రకటిస్తూ లండన్‌ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీనిపై ట్విటర్‌ వేదికగా స్పందించిన మాల్యా.. భారతీయ బ్యాంకులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల నుంచి తాను చేసిన అప్పుకు రెట్టింపు ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుందని అన్నారు. ఈడీకి సొమ్ము తిరిగి ఇవ్వాల్సి వస్తుందన్న భయంతోనే.. తనను దివాలాదారుగా ప్రకటించమని బ్యాంకులు న్యాయస్థానాన్ని కోరాయని ఆరోపించారు. 

‘‘ప్రభుత్వ బ్యాంకుల నుంచి నేను తీసుకున్న రుణాల మొత్తం రూ.6.2వేల కోట్లు. ఇందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ రూ.14వేల కోట్ల విలువైన నా ఆస్తులను జప్తు చేసుకుంది. ఈ ఆస్తులను బ్యాంకులకు ఇచ్చింది. ఇందులో కొన్నింటిని విక్రయించిన బ్యాంకులు రూ.9వేల కోట్ల వరకు నగదు రూపంలో రికవరీ చేసుకున్నాయి. మిగతా రూ.5వేల కోట్లను సెక్యూరిటీగా పెట్టుకున్నాయి. ఇప్పుడు ఆ డబ్బును ఈడీకి తిరిగి ఇవ్వాల్సి వస్తుందనే బ్యాంకులు కోర్టుకు వెళ్లాయి. నన్ను దివాలాదారుగా ప్రకటించేలా చేశాయి’’ అని మాల్యా ట్విటర్‌లో అక్కసు వెళ్లగక్కారు.

మాల్యా దివాలా తీసినట్లు లండన్‌ హైకోర్టు నిన్న తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. బకాయిలు చెల్లించగల స్థితిలో మాల్యా ఉన్నారనేందుకు తగిన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయనపై చాలాకాలంగా న్యాయపోరాటం చేస్తున్న బ్యాంకులకు భారీ విజయం లభించింది. ప్రపంచంలో మాల్యాకు ఎక్కడ ఆస్తులు ఉన్నా వాటిని స్తంభింపజేసి తమ బకాయిలను రాబట్టుకొనేలా ఉత్తర్వులు పొందేందుకు భారతీయ స్టేట్‌ బ్యాంకు నేతృత్వంలోని 13 బ్యాంకుల కన్సార్షియంకు మార్గం సుగమమైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని