Omicron: ఒమిక్రాన్‌పై టీకాలు పనిచేస్తాయా? బయోఎన్‌టెక్‌ సీఈఓ ఏమన్నారంటే..

కొత్త వేరియంట్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ల సామర్థ్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ అంతర్జాతీయ ఔషధ తయారీ సంస్థ బయోఎన్‌టెక్‌ సీఈఓ ఉగుర్‌ సాహిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 01 Dec 2021 17:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. దీనిపై ఇంకా సమగ్ర సమాచారం లేకపోవడంతో అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వేరియంట్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ల సామర్థ్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ అంతర్జాతీయ ఔషధ తయారీ సంస్థ బయోఎన్‌టెక్‌ సీఈఓ ఉగుర్‌ సాహిన్‌ కొంత ఊరటనిచ్చే వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు.. ఒమిక్రాన్‌ సోకిన వారిని తీవ్రమైన వ్యాధి లక్షణాల నుంచి కాపాడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఎక్కువ మొత్తంలో ఉత్పరివర్తనాలు చోటుచేసుకున్న కొత్త వేరియంట్ వల్ల టీకా వేసుకున్న వారిలోనూ ఎక్కువ కేసులు బయటపడొచ్చని సాహిన్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ వల్ల ఏర్పడే ప్రతిరోధకాల నుంచి ఈ వేరియంట్‌ తప్పించుకోగలిగే అవకాశం కూడా ఉండొచ్చన్నారు. అయినప్పటికీ టీకా వల్ల వచ్చిన రోగనిరోధకత దాన్ని అడ్డుకోగలుగుతుందని వివరించారు. అయితే, నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. బూస్టర్‌ డోసును వేగవంతం చేయాలని సూచించారు. ఫైజర్‌తో కలిసి బయోఎన్‌టెక్‌ కరోనా టీకాను తయారు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో ప్రధానంగా పంపిణీ చేస్తున్న టీకాల్లో ఇదొకటి.

భిన్న వాదనలు..

ఒమిక్రాన్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో సాహిన్‌ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం కొంత ఊరట కలిగించే విషయమనే చెప్పాలి. మరో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ మోడెర్నా సీఈఓ స్టీఫన్‌ బ్యాన్సెల్‌ మంగళవారం మాట్లాడుతూ.. ఒమిక్రాన్‌ కోసం కొత్త టీకాను అభివృద్ధి చేయాల్సి రావొచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో నిన్న ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఇక ఆస్ట్రాజెనెకాతో కలిసి కొవిడ్‌ టీకా అభివృద్ధి చేసిన ఆక్స్‌ఫర్డ్‌ వర్గాలు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న టీకాలు ఒమిక్రాన్‌ నుంచి రక్షణ కల్పించలేవని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని వ్యాఖ్యానించాయి.

మరో రెండు వారాలు గడిస్తే ఒమిక్రాన్‌పై పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి వరకు వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని చెప్పలేమంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాట్లాడుతూ.. కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అయితే, ప్రస్తుతం ఉన్న టీకాలు దీని నుంచి కొంత వరకైనా రక్షణ కల్పిస్తాయని తమ వైద్య బృందం భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై సమగ్ర సమాచారం మరికొన్ని వారాల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. ఒమిక్రాన్‌ కోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్లు తయారు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు కొత్త టీకాల అవసరం ఏర్పడితే.. వాటి అత్యవసర వినియోగ అనుమతికి కావాల్సిన ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు ఐరోపా సమాఖ్య ఔషధ నియంత్రణ సంస్థ మంగళవారం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని