Indira to Rahul: ఇందిరాగాంధీ చనిపోయే ముందు రాహుల్‌తో ఏం చెప్పారు..?

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) వర్ధంతి సందర్భంగా.. ఆమెతో తనకున్న అనుబంధాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) గుర్తు చేసుకున్నారు.

Published : 01 Nov 2021 01:16 IST

నానమ్మ మాటలను గుర్తుచేసుకున్న రాహుల్‌

దిల్లీ: భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) వర్ధంతి సందర్భంగా.. ఆమెతో తనకున్న అనుబంధాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) గుర్తు చేసుకున్నారు. నానమ్మ చనిపోయే కొన్ని గంటల ముందు తనతో చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఆయన.. నానమ్మతో చిన్ననాటి జ్ఞాపకాలను, ఆమె చెప్పిన మాటలను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇందిరా గాంధీ అంత్యక్రియలు జరుగుతోన్న సమయంలో చితివైపు చూడలేక తన ముఖాన్ని దాచుకుంటున్న దృశ్యాలతో కూడిన ఓ వీడియోను షేర్‌ చేసిన రాహుల్‌ గాంధీ అందుకు గల కారణాలను వివరించారు. తన జీవితంలో రెండో అత్యంత బాధాకరమైన రోజుగా పేర్కొన్న రాహుల్‌ గాంధీ.. నానమ్మే తనకు ‘సూపర్‌ మదర్’ అంటూ చలించిపోయారు.

మరణాన్ని ముందుగానే ఊహించి..

‘నానమ్మ అంత్యక్రియలు జరిగే సమయంలో నా తలను దాచుకోవడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ‘నాకేదైనా జరిగితే ఏడవద్దు’ అని నానమ్మ నాతో చెప్పింది. అలా చెప్పిన మూడు, నాలుగు గంటల తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయింది. తనను చంపేస్తారనే విషయం నానమ్మ ముందుగానే ఊహించి ఉంటారు. ఇంట్లోని వారందరూ దాన్ని ముందుగానే గ్రహించారని అనుకుంటున్నాను. అప్పుడు నానమ్మ చెప్పిన మాటలు నాకు అర్థం కాలేదు. నా జీవితంలో అత్యంత బాధాకరమైన రెండో సంఘటన’ అని ఇందిరా గాంధీ అంత్యక్రియల నాటి వీడియోను చూపిస్తూ రాహుల్‌ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఏదైనా వ్యాధితో చనిపోవడం అతిపెద్ద శాపం అంటూ ఒకసారి భోజనం చేసే సమయంలో నాతోపాటు మా అందరికీ నానమ్మ చెప్పింది. ఆమె నమ్మిన సిద్ధాంతాలు, దేశం కోసం ఇలా చనిపోవడమే అత్యంత ఉత్తమ మార్గం అని భావించి ఉంటారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ, ఇప్పుడు అర్థమయ్యింది’ అని ఇందిరాగాంధీ తనతో చెప్పిన మాటలను రాహుల్‌ గాంధీ గుర్తు చేసుకున్నారు.

ఆమే ‘సూపర్ మదర్‌’..

‘మా కుటుంబంలో నాన్న చాలా కఠినంగా ఉండేవారు. నాపై ఎప్పుడైనా కోపం చూపించినప్పుడు నానమ్మే నాకు మద్దతుగా నిలబడేది. ‘సూపర్‌’ మదర్‌ నానమ్మతో కలిపి నాకు నిజంగా ఇద్దరు తల్లులు’ అని కుటుంబ సభ్యుల ఫోటోలతో నిండివున్న గదిని చూపిస్తూ రాహుల్‌ గాంధీ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

ఆమె జీవితమే ఓ మార్గదర్శకం: ప్రియాంకా

ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఆమె మనుమరాలు ప్రియాంకా గాంధీ.. నానమ్మతో దిగిన చిన్నప్పటి ఫోటోను ట్వీటర్‌లో షేర్‌ చేశారు. ‘దేశభక్తి, సాహసం, తెగింపునకు మీ జీవితం ఒక సందేశం. మీరు నమ్మిన సిద్ధాంతాలను పాటిస్తూ న్యాయం కోసం పోరాటం కొనసాగించేందుకు మీ జీవితమే ఓ మార్గదర్శకం’ అంటూ ప్రియాంకా గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, 1966 నుంచి 1977 మధ్య కాలంలో భారత ప్రధానిగా సేవలందించిన ఇందిరా గాంధీ.. శక్తివంతమైన ప్రధానుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అయితే, 1977లో ఎమర్జెన్సీ విధించి తీవ్ర అపవాదును కూడా మూటగట్టుకున్నారు. అనంతరం 1980లో మరోసారి ప్రధానిగా బాధత్యలు చేపట్టిన ఇందిరా గాంధీ.. ఆమె చనిపోయేవరకు ఆ పదవిలో కొనసాగారు. 1984 అక్టోబర్‌ 31న సొంత భద్రతా సిబ్బంది చేతిలోనే ఇందిరా గాంధీ హత్య (Assassination)కు గురైన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని