Long Covid: ‘లాంగ్‌ కొవిడ్‌’ ఆందోళనకరమే..!

చాలా మంది దీర్ఘ కొవిడ్‌ (Long Covid) సమస్యలతో బాధపడడం ఆందోళన కలిగించే విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 06 Aug 2021 01:51 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

జెనీవా: ఏడాదిన్నర కాలంగా ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి.. ఇప్పటికే 20కోట్ల మందిలో వెలుగు చూసింది. ఇక గుర్తించని వారి సంఖ్య మరింత ఎక్కువగానే ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది దీర్ఘ కొవిడ్‌ (Long Covid) సమస్యలతో బాధపడడం ఆందోళన కలిగించే విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్‌ మహమ్మారికి సంబంధించిన మిస్టరీ అంశాల్లో ‘లాంగ్‌ కొవిడ్‌’ ఒకటిగా మిగిలిపోయిందని అభిప్రాయపడింది. అందుచేత వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత కూడా ఏమైనా దుష్ప్రభావాలు ఎదురైతే వైద్యుల సహాయం తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది.

‘పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌ (Post Covid Syndrome) లేదా లాంగ్‌ కొవిడ్‌’ అనేది వాస్తవం. దీనిని మేము కూడా నిర్ధారించుకున్నాం. కానీ, ఇవి ఎంతకాలం ఉంటాయనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేం. వీటిపై అధ్యయనం చేసి పూర్తిగా నిర్వచించే పనిలో నిమగ్నమయ్యాం’ అని కొవిడ్‌-19పై WHO టెక్నికల్‌ విభాగాధిపతి మరియా వాన్‌ కేర్ఖోవ్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత చాలామంది సుదీర్ఘ కాలం పాటు వాటి దుష్ర్పభావాలను (Side Effects) ఎదుర్కొంటున్నట్లు గుర్తించామన్నారు. అంతేకాకుండా దీర్ఘ కాలం కొవిడ్‌ ప్రభావాలతో బాధపడుతున్న వారికి మెరుగైన పునరావాస కార్యక్రమాలు కల్పించడంతో పాటు పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌ (Syndrome) గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి చేస్తోందని మరియా వాన్‌ స్పష్టం చేశారు. అయినప్పటికీ వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత కనిపించే లక్షణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు.

200లకుపైగా లక్షణాలు..

కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ తగ్గినప్పటికీ అనేక మంది బాధితుల్లో దీర్ఘకాలం పాటు కొన్ని రుగ్మతలు కనిపిస్తున్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. వాటి సంఖ్య 200లకుపైగానే ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది వాస్తవమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లినికల్‌ కేర్‌ విభాగాధిపతి జానెత్‌ దియాజ్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా ఛాతి నొప్పి, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని అన్నారు. కొందరిలో ఇవి కోలుకున్న తర్వాత మూడు నెలలు కనిపించగా.. మరికొందరిలో 6నెలల వరకూ ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా మరికొందరి బాధితుల్లో ఇవి తొమ్మిది నెలలకుపైగా ఉండడం ఆందోళన కలిగించే విషయమని జానెత్ దియాజ్‌ పేర్కొన్నారు. ఇలా సుదీర్ఘ కాలం (Long Covid) లక్షణాలు కనిపించడానికి నరాల సమస్యలు, ఇన్‌ఫెక్షన్‌పై రోగనిరోధకత ప్రతిస్పందనతో పాటు పలు అవయవాల్లో వైరస్‌ అలాగే ఉండిపోవడం వంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయని అన్నారు. వీటిపై మరింత స్పష్టత వచ్చేందుకు 2019లో చైనాలో తొలిసారి వైరస్‌ బారినపడి కోలుకున్న బాధితులపైనా అధ్యయనం జరిగితే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని