Europe: కరోనా విలయం.. ఇలాగైతే మరో 3నెలల్లో 5 లక్షల మరణాలు!

గతేడాది మాదిరిగానే మహమ్మారి విజృంభణకు యూరప్‌ కేంద్రబిందువుగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

Updated : 13 Sep 2022 14:56 IST

హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

లండన్‌: యావత్‌ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ రాకతో వైరస్‌ విజృంభణ కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపించినప్పటికీ పలు దేశాల్లో మళ్లీ కోరలు చాచుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది మాదిరిగానే మహమ్మారి విజృంభణకు యూరప్‌ కేంద్ర బిందువుగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గడిచిన కొన్ని వారాల్లో అక్కడ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు, ఆస్పత్రుల్లో చేరికలు ఇలాగే కొనసాగితే వచ్చే ఫిబ్రవరి నాటికి మరో 5లక్షల కొవిడ్ మరణాలు సంభవించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ పలు దేశాల్లో కొవిడ్‌ తీవ్రత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా యూరప్‌ దేశాల్లో కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. కేవలం గడిచిన వారంలోనే యూరప్‌ వ్యాప్తంగా కొత్తగా 18లక్షల కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసుల్లో 6శాతం పెరుగుదల కనిపించింది. వీటితో పాటు గతవారంలో మరణాల సంఖ్య 24వేలకు చేరుకుంది. అక్కడి కొవిడ్‌ మరణాల్లో ఏకంగా 12శాతం పెరుగుదల కనిపించింది. ప్రతి లక్ష మందికి 192 కేసులు బయటపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గతవారం నమోదైన మొత్తం కేసుల్లో 59శాతం ఉండగా, సగం మరణాలు ఇక్కడే చోటుచేసుకున్నాయి.

ఫిబ్రవరి నాటికి 5లక్షల మరణాలు..

గత ఐదు వారాలుగా అక్కడ పెరుగుతోన్న కొవిడ్‌ తీవ్రత..  మరికొన్ని రోజులపాటు ఇలాగే కొనసాగితే వచ్చే ఫిబ్రవరి నాటికి యూరప్‌లో 5లక్షల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హాన్స్‌ క్లూగే హెచ్చరించారు. వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నప్పటికీ కొవిడ్ తీవ్రత క్రమంగా పెరగడం ఆందోళన కలిగించే విషయమని అభిప్రాయపడ్డారు. అయితే, కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారిలో అధికంగా పూర్తి మోతాదులో వ్యాక్సిన్‌ తీసుకోనివారే ఉన్నట్లు వెల్లడించారు. ఇలా వైరస్‌ తీవ్రత పెరుగుతుండటం చూస్తుంటే మరో వేవ్‌ ముంచుకొస్తుందనే విషయం స్పష్టమవుతోందని స్వీడన్‌ చీఫ్‌ ఎపిడమాలజిస్ట్‌ ఆండర్స్‌ టెగ్నెల్‌ స్పష్టం చేశారు. ముఖ్యంగా శీతాకాలంలో వైరస్‌ విజృంభణ పెరగడం ఈ ఆందోళన పెరగడానికి కారణమని అన్నారు.

మందగించిన వ్యాక్సినేషన్‌..

యూరప్‌ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగినప్పటికీ పలు దేశాల్లో పూర్తి స్థాయిలో టీకాను అందించలేకపోతున్నాయి. యూరప్‌లో సరాసరిగా 47శాతం పూర్తిస్థాయిలో పంపిణీ చేశారు. కేవలం 8 దేశాలు మాత్రమే 70శాతం మందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందించాయి. ఇదే సమయంలో సరైన వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉన్నప్పటికీ మిగతావారు వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ముందుకు రావడం లేదనే వాదన ఉంది. మరో ముప్పు పొంచివున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ఆమ్‌స్టర్‌డామ్‌లోని యూరోపియన్‌ మెడికల్‌ ఏజెన్సీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇక ఈ ప్రాంతంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ సమృద్ధిగా అందుబాటులో ఉన్నప్పటికీ.. అవి అన్ని ప్రాంతాలకు సమానంగా చేరడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ విభాగాధిపతి డాక్టర్‌ మైక్‌ రేయాన్‌ అభిప్రాయపడ్డారు. ఈ అగాధాన్ని వెంటనే సరిచేయడంతో పాటు కొవిడ్‌ కట్టడి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని యూరప్‌ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని