Tiger: నల్లపులికి ఆ రంగు ఎందుకు వచ్చిందో గుట్టు విప్పిన శాస్త్రవేత్తలు

ప్రపంచంలోనే నల్లపులులు కనిపించే ఏకైక ప్రదేశం... ఒడిశాలోని సిమిలాపాల్‌. అక్కడి పులులు.. రాయల్‌ బెంగాల్‌ పులులు కంటే భిన్నంగా కనిపిస్తాయి.

Updated : 16 Sep 2021 07:09 IST

 

దిల్లీ: ప్రపంచంలోనే నల్లపులులు కనిపించే ఏకైక ప్రదేశం... ఒడిశాలోని సిమిలాపాల్‌. అక్కడి పులులు.. రాయల్‌ బెంగాల్‌ పులులు కంటే భిన్నంగా కనిపిస్తాయి. వీటి శరీరంపై నల్లటి చారలు దట్టంగా పరచుకొని ఉంటాయి. ఒక్కోసారి పూర్తి నలుపు వర్ణంలోనూ కనిపిస్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వీటిపై ఆకర్షణ పెరిగింది. ఇవి ఎందుకు నలుపు వర్ణంలో ఉంటాయి? దాని వెనుక కారణమేమిటి? అన్న అంశంపై చాలా పరిశోధనలు జరిగాయి. ఎట్టకేలకు ఈ రహస్యాన్ని బెంగళూరు శాస్త్రవేత్తలు ఛేదించారు. ‘ట్రాన్స్‌మెంబ్రెన్‌ అమినోపెప్టిడేస్‌ క్యూ’ అనే జన్యువు ఉత్పరివర్తనం కారణంగా ఈ పులులకు నలుపు రంగు వచ్చినట్లు కనుగొన్నారు. సిమిలాపాల్‌ టైగర్లు.. ఇతర జాతుల పులులతో సంపర్కం జరపవని, అందుకే ఇవి అంతరించే పోయే ప్రమాదం అధికంగా ఉందని ఈ పరిశోధన పేర్కొంది. 2018 లెక్కల ప్రకారం భారత్‌లో 2,967 పులులు ఉన్నాయి. సిమిలాపాల్‌లో తీసిన ఫొటోల ఆధారంగా కేవలం 8 నల్ల పులులు మాత్రమే ఉన్నాయని తేలింది. బెంగళూరులోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌(ఎన్సీబీఎస్‌) శాస్త్రవేత్తలు దేశంలోని ఇతర పరిశోధన సంస్థలతో కలిసి ఈ అధ్యయనం చేశారు. వీరి పరిశోధన పత్రాన్ని నేషనల్‌ అకడమిక్‌ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రచురించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని