Kangana: కంగనా ‘పద్మశ్రీ’ని వెనక్కి తీసుకోండి: రాష్ట్రపతికి DCW లేఖ

కంగనా రనౌత్‌కు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు దిల్లీ మహిళా కమిషన్‌ లేఖ రాసింది.

Updated : 14 Nov 2021 21:15 IST

నటి వివాదాస్పద వ్యాఖ్యలపై పెరుగుతోన్న వ్యతిరేకత

దిల్లీ: భారత స్వాతంత్ర్యం విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut)పై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఆమెకు ఇచ్చిన పద్మశ్రీ (Padma Shri) పురస్కారాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. తాజాగా ఇదే విషయంపై స్పందించిన దిల్లీ మహిళా కమిషన్‌ (DCW).. కంగనా రనౌత్‌కు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాసింది. అంతేకాకుండా ఆమెపై దేశ ద్రోహం అభియోగాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరింది.

కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు ఏదో ఒకసారి జరిగినవి కాదని.. ఆమె మానసిక స్థితి సరిగా లేనట్లు కనిపిస్తోందని రాష్ట్రపతికి రాసిన లేఖలో దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ స్వాతి మలివాల్‌ పేర్కొన్నారు. అనేకసార్లు సొంత దేశ ప్రజలపైనే విషం చిమ్ముతున్నారని.. ఆమెతో ఏకీభవించని వారిపై నీచమైన పదజాలంతో దాడి చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి విద్రోహ స్వభావం కలిగిన ఇటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ తక్షణమే ఆమెపై చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్రపతిని దిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మలివాల్‌ విజ్ఞప్తి చేశారు. కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు దేశస్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ, భగత్‌సింగ్‌ వంటి ఎందరో మహనీయులను అవమానపరచడమే పేర్కొన్నారు. అంతేకాకుండా విద్రోహ స్వభావం కలిగిన ఇటువంటి వ్యాఖ్యలు కోట్లాది మంది భారతీయుల మనోభావాలను కూడా దెబ్బతీశాయని రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, ‘మన దేశానికి 1947లో లభించిన స్వాతంత్య్రం ఆంగ్లేయుల భిక్ష మాత్రమే. నిజమైన స్వాతంత్య్రం 2014లోనే వచ్చింది’ అంటూ నటి కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌ కూడా పెరుగుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని