Afghanistan: ఉగ్రవాద సంస్థలకు మరోసారి వేదిక కానీయొద్దు.. ఐరాస చీఫ్‌ పిలుపు

యావత్‌ ప్రపంచానికి పెనుముప్పుగా ఉన్న ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రపంచదేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి చీఫ్‌ పిలుపునిచ్చారు.

Published : 16 Aug 2021 21:52 IST

వాషింగ్టన్‌: అఫ్గాన్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఆయా దేశాలు తమ సానుభూతి వ్యక్తం చేస్తూనే.. అఫ్గాన్‌కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇదే సమయంలో యావత్‌ ప్రపంచానికి పెనుముప్పుగా ఉన్న ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రపంచదేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి చీఫ్‌ ఆంటోనియా గుటెరస్‌ పిలుపునిచ్చారు. వాటికి వేదికగా అఫ్గాన్‌ మారకుండా ప్రపంచ దేశాలు ఒకేతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు.

‘‘ఉగ్రవాద సంస్థలు అఫ్గానిస్థాన్‌ను వేదికగా లేదా సురక్షిత ప్రాంతంగా చేసుకునే అవకాశం మరోసారి కల్పించకూడదు. ఇందుకోసం అంతర్జాతీయ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉంది’’ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెరస్‌ పిలుపునిచ్చారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులతో వేల మంది దేశం విడిచిపోతున్నారన్న వార్తలు కలవరపెడుతున్నాయని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా అక్కడి మహిళలు, బాలికలు పొందిన హక్కులు చేజార్చిపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అఫ్గాన్‌ పౌరుల మానవ హక్కులను కాపాడడంతో పాటు అక్కడ సురక్షిత వాతావరణం నెలకొనేలా తాలిబన్లతోపాటు ఇతర వర్గాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని