Farm Laws: 24న కేంద్ర కేబినెట్‌ భేటీ.. సాగు చట్టాల రద్దుపై తీర్మానం?

సాగు చట్టాలను వెనక్కి తీసుకునే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 24న జరుగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలోనే వీటిపై తీర్మానం చేయనున్నట్లు సమాచారం.

Updated : 21 Nov 2021 14:47 IST

దిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సాగు చట్టాలను వెనక్కి తీసుకునే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 24న జరుగనున్న కేంద్రకేబినెట్‌ సమావేశంలోనే వీటిపై తీర్మానం చేయనున్నట్లు సమాచారం. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 29 నుంచి జరుగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లోనే సాగుచట్టాల రద్దు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ప్రధానమంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో వీటిపై ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

గురునానక్‌ జయంతి రోజున దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించామని ప్రకటించారు. రైతుల ప్రయోజనాల కోసమే సాగు చట్టాలను తీసుకువచ్చినప్పటికీ కొందరు రైతు సోదరులకు అర్థమయ్యేలా చెప్పలేకపోయామని అన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను క్షమాపణ కోరిన ఆయన.. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే సాగు చట్టాల రద్దు ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు.

ఈ నేపథ్యంలో చట్టంగా మారిన దానిని రద్దు చేయాలంటే అవి రూపుదిద్దుకోవడానికి అవలంబించే పద్ధతినే అనుసరిస్తారు. చట్టాన్ని తేవాలన్నా.. దాన్ని రద్దు చేయాలన్నా కేవలం పార్లమెంటుకే ఆ అధికారం ఉంటుంది. సాధారణంగా ఏదైనా కొత్త చట్టాన్ని తెచ్చేందుకు పార్లమెంటులో ఏవిధంగానైతే బిల్లును ప్రవేశపెడుతారో.. చట్టం రద్దుకోసం అదే ప్రక్రియ ఉంటుంది. ఇందులో భాగంగా మూడు చట్టాలను రద్దు చేయడానికి ప్రభుత్వం ఓ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టనుంది. బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం పార్లమెంటులో వీటిపై చర్చ జరగడంతో పాటు ఓటింగ్‌ను నిర్వహిస్తారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని