Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలు... అఖిలపక్ష భేటీ ప్రారంభం!

సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్షం నేడు సమావేశమయ్యింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో జరుగుతోన్న ఈ భేటీకి పలు పార్టీల నేతలు హాజరయ్యారు.

Published : 28 Nov 2021 13:35 IST

వ్యూహాలు రచిస్తోన్న పార్టీలు

దిల్లీ: సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్షం నేడు సమావేశమయ్యింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో జరుగుతోన్న ఈ భేటీకి పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, పీయూష్‌ గోయల్‌, అర్జున్‌రామ్‌ మేఘవాల్‌లు హాజరుకాగా కాంగ్రెస్‌ తరపున మల్లికార్జున ఖర్గే, అధిర్‌ రంజన్‌, ఆనంద్‌ శర్మ హాజరయ్యారు. ఇక వైకాపా నుంచి విజయసాయిరెడ్డి హాజరుకాగా.. తెలుగుదేశం తరపున గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌లు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో పార్లమెంటు సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నారు. ముఖ్యంగా సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఆయా రాజకీయ పార్టీలు తమ డిమాండ్లను ప్రభుత్వం ఎదుట ఉంచుతున్నాయి. ఇదే సమయంలో సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కూడా కోరనుంది.

రేపటి నుంచి మొదలుకానున్న శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అటు ప్రభుత్వంతో పాటు విపక్షపార్టీలు కూడా కసరత్తు ప్రారంభిస్తున్నాయి. ముఖ్యంగా విపక్షాల నుంచి ప్రశ్నలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికార ఎన్‌డీఏ పక్షం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నేటి సాయంత్రం 3గంటలకు భాజపా పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా హాజరుకానున్నాయి. పార్లమెంటులో విపక్షాలకు దీటుగా సమాధానం ఇచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. అటు రాజ్యసభ కూడా రేపటి నుంచే ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజ్యసభ పక్షనేతలతో ఛైర్మన్‌ నేడు భేటీకానున్నారు.

నూతన సాగు చట్టాలపై రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో వాటిని రద్దు చేస్తున్నట్లు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ సమావేశాల తొలిరోజునే ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటు ఈ సమావేశాల్లోనే మొత్తం 26బిల్లులు సభ ముందుకు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కీలక బిల్లులు సభముందుకు వస్తోన్న నేపథ్యంలో సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని భాజపాతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ వారి సభ్యులకు ఇప్పటికే విప్‌ జారీ చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని