ఇప్పటివరకు 7కోట్ల కరోనా పరీక్షలు..

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 7కోట్ల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించామని కేంద్రం వెల్లడించింది. దేశంలో నమోదవుతున్న కేసులు, పరీక్షల రేటుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం మీడియాకు తెలిపింది.

Published : 26 Sep 2020 16:35 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 7కోట్ల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించామని కేంద్రం వెల్లడించింది. దేశంలో నమోదవుతున్న కేసులు, పరీక్షల రేటుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం మీడియాకు తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ‘దేశంలో ఇప్పటి వరకు 7కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించాం. నిత్యం దాదాపు 14 లక్షల టెస్టులు నిర్వహిస్తున్నాం. గడిచిన 24 గంటల్లో దేశంలో నమోదైన 85వేల కేసుల్లో 75శాతం కేవలం పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. వాటిలో మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, యూపీ, ఒడిశా, దిల్లీ, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రతిరోజు 17వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా మరణాలు 1,089 ఉండగా అందులో 83శాతం పైన పేర్కొన్న పది రాష్ట్రాల్లోనివే. మహారాష్ట్రలో 416 మంది మరణించగా.. కర్ణాటకలో 86 మంది, యూపీలో 84 మంది ప్రాణాలు వదిలారు’ అని వెల్లడించింది.  

అదేవిధంగా దేశంలో పరీక్షల సామర్థ్యాన్ని కూడా పెంచామని.. ఇప్పటి వరకు 1,823 ప్రయోగశాలల్లో టెస్టులు నిర్వహిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఉన్నత స్థాయిలో టెస్టులు చేయడం ద్వారానే పాజిటివ్‌ కేసులు సత్వరం గుర్తించడానికి వీలవుతుందని వెల్లడించింది. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 59,03,933కి చేరిన విషయం తెలిసిందే. వీరిలో 9,60,696 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 48,49,585 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని