
ఇకపై అక్కడ మాస్క్ తప్పనిసరికాదు!
100% వాణిజ్య కార్యకలాపాలకూ అనుమతి
టెక్సాస్ గవర్నర్ నిర్ణయం
ఆస్టిన్: ప్రపంచాన్ని కరోనా భయం ఇంకా వెంటాడుతున్న తరుణంలో అమెరికాలోని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ కీలక నిర్ణయం ప్రకటించారు. అక్కడి ప్రజలు ఇకపై మాస్క్‌లు ధరించడం తప్పనిసరి కాదన్నారు. రాష్ట్రంలో నూరు శాతం వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేందుకూ అనుమతిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం మార్చి 10 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.
అమెరికాలో పెద్ద రాష్ట్రమైన టెక్సాస్‌ను కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ వైరస్ ధాటికి అక్కడ దాదాపు 42వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం తప్పనిసరి నిబంధనల్ని పూర్తిగా ఎత్తివేసిన తొలి పెద్ద రాష్ట్రంగా టెక్సాన్ నిలవనుంది. కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభంతో అనేకమంది టెక్సాస్ పౌరులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని గవర్నర్ అబోట్ తెలిపారు. చిన్న వ్యాపార సంస్థల యజమానులైతే బిల్లులు చెల్లించడానికి కూడా అవస్థలు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితికి ముగింపు పలికేలా వాణిజ్య కార్యకలాపాలకు నూరు శాతం అనుమతించేందుకు ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు. కరోనా టీకాలు, మెరుగైన పరీక్షలు, చికిత్సా విధానం అందుబాటులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టంచేశారు. ఈ వైరస్ నుంచి ప్రజల్ని కాపాడేందుకు అవసరమైన పనిముట్లు తమ వద్ద ఉన్నాయని మంగళవారం ఓ రెస్టారెంట్లో జరిగిన లుబ్బాక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు భారీ సంఖ్యలో మాస్క్‌లు పంపిణీ చేయాలంటూ ఇటీవల అధికారుల్ని ఆదేశించారు. అంతేకాకుండా వైద్యరంగ నిపుణులు కూడా ఇంకా కరోనా కలవరం కొనసాగుతున్న వేళ ఆంక్షలు అవసరమని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్సాస్ గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు ఎత్తివేయడమంటే.. వ్యక్తిగత బాధ్యతను విస్మరించమని అర్థం కాదని గవర్నర్ పేర్కొన్నారు. గతేడాది జూలైలో అందరికీ మాస్క్‌లు తప్పనిసరి చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇవీ చదవండి
Advertisement