మాస్కు ధరించలేదని థాయ్‌ ప్రధానికి జరిమానా!

అధికారులతో సమావేశం సందర్భంగా మాస్కు ధరించనందుకు గాను...

Published : 27 Apr 2021 09:54 IST

దిల్లీ, బ్యాంకాక్‌: అధికారులతో సమావేశం సందర్భంగా మాస్కు ధరించనందుకు గాను... థాయ్‌లాండ్‌ ప్రధానమంత్రి జనరల్‌ ప్రయూత్‌ చాన్‌-వో-చాకు అధికారులు 6 వేల భాట్‌ల (సుమారు రూ.14,270) జరిమానా విధించారు! దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా థాయ్‌ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. భారత్‌ నుంచి థాయ్‌ ప్రజలు మినహా మరెవరూ తమదేశం రావద్దని ఆంక్షలు విధించింది. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఇక బ్యాంకాక్‌ మెట్రోపాలిటన్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిబంధనల ప్రకారం... రాజధానిలో ఇల్లు దాటి బయటకు వచ్చే ప్రతి వ్యక్తి మాస్కు ధరించడం తప్పనిసరి. దీన్ని ఉల్లంఘించే వారికి 20,000 భాట్ల (రూ.47,610) వరకూ జరిమానా విధిస్తారు. వ్యాక్సిన్‌ కొనుగోలు విషయమై ప్రధాని ప్రయూత్‌ సోమవారం సలహాదారులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆయన మాస్కు ధరించలేదు. ఈ విషయంపై తానే అధికారులకు ఫిర్యాదు చేసినట్టు బ్యాంకాక్‌ గవర్నర్‌ అశ్విన్‌ క్వాన్‌ముయాంగ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో వెల్లడించారు. కాసేపట్లోనే ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ప్రధాని తీరుపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో... ప్రయూత్‌కు అధికారులు జరిమానా విధించారు. కాగా, థాయ్‌లాండ్‌ పౌరులు మినహా మిగతా వారికి తమ దేశంలో ప్రవేశించేందుకు ఇచ్చే ప్రవేశ ధ్రువీకరణ పత్రాల (సీవోఈ) మంజూరును మే 1 నుంచి రద్దు చేస్తున్నట్టు దిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇది భారతీయులకూ వర్తిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని