104ఏళ్ల బామ్మ: 2సార్లు కరోనాను జయించెనమ్మ

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎత్తులు ఈ బామ్మ ముందు చిత్తయ్యాయి. 104ఏళ్ల వయసులో ఆమె మనోధైర్యం చూసి కొవిడ్‌ తోకముడుచుకుని తుర్రుమంది

Updated : 09 Apr 2021 17:14 IST

కొలంబియా: యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎత్తులు ఈ బామ్మ ముందు చిత్తయ్యాయి. 104ఏళ్ల వయసులో ఆమె మనోధైర్యం చూసి కొవిడ్‌ తోకముడుచుకుని తుర్రుమంది. కొలంబియాకు చెందిన ఈ బామ్మ రెండు సార్లు మహమ్మారిని మట్టికరిపించి వైరస్‌ నుంచి క్షేమంగా బయటపడ్డారు.

కొలంబియాలోని తుంజా ప్రాంతానికి చెందిన ఈ బామ్మ పేరు కార్మెన్‌ హెర్నాండెజ్‌. వయసు 104 ఏళ్లు. ప్రపంచమంతా కొవిడ్‌ మహమ్మారి విజృంభించిన గతేడాది జూన్‌లో కార్మెన్‌ కూడా వైరస్‌ బారినపడ్డారు. దీంతో ఆమెను స్థానిక శాన్‌జోస్‌ నర్సింగ్‌ హోమ్‌లో చేర్చి చికిత్స అందించారు. అప్పుడే ఆమె కోలుకోవడం కష్టమని వైద్యులు భావించారు. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ కార్మెన్‌ వైరస్‌ను జయించారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో సినోవాక్‌ టీకా తొలి డోసు తీసుకున్నారు. 

అయితే ఈ బామ్మకు మార్చిలో రెండోసారి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను తుంజా యూనివర్శిటీ ఆసుపత్రిలో చేరారు. తొలుత ఐసీయూలో చికిత్స పొందిన ఆమెను ఆ తర్వాత 21 రోజుల పాటు వైద్యులు నిరంతరం పర్యవేక్షించారు. ఈసారి కూడా మహమ్మారిపై బామ్మ ఘనవిజయం సాధించారు. రెండోసారి వైరస్‌ నుంచి కోలుకున్న కార్మెన్‌ ఈ వారమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మనోధైర్యంతో రెండుసార్లు కరోనాను జయించిన ఈ బామ్మకు ఆసుపత్రి సిబ్బంది కరతాళ ధ్వనులతో వీడ్కోలు ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఆసుపత్రి డైరెక్టర్‌ మాట్లాడుతూ.. 104 ఏళ్ల వయసులో కార్మెన్‌ రెండు సార్లు కరోనా నుంచి కోలుకోవడం.. వైద్యుల్లోనే గాక ప్రపంచంలోనే ప్రతి ఒక్కరిలో కొత్త ఆశలు నింపుతోందని కొనియాడారు. 1916లో జన్మించిన కార్మెన్‌.. గతంలో తీవ్రమైన చర్మ క్యాన్సర్‌ను జయించారు. ఆ తర్వాతే ఆమె హృదయం మరింత దృఢంగా మారింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని