Second Wave: 624 మంది డాక్టర్లు బలి

దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. తొలిదశ కంటే రెండో దశలో ప్రాణనష్టం తీవ్రంగా ఉంది. సాధారణ ప్రజల మాట అటుంచితే.. కరోనాపై పోరాడుతున్న వారిలో ముందువరుసలో ఉన్న వైద్యులే ఈ మహమ్మారికి బలవ్వడం మింగుడు పడటం లేదు

Published : 03 Jun 2021 17:43 IST

దిల్లీ: దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. తొలిదశ కంటే రెండో దశలో ప్రాణనష్టం తీవ్రంగా ఉంది. సాధారణ ప్రజల మాట అటుంచితే.. కరోనాపై పోరాడుతున్న వారిలో ముందువరుసలో ఉన్న వైద్యులే ఈ మహమ్మారికి బలవ్వడం మింగుడు పడటం లేదు. రెండోదశ వ్యాప్తిలో ఇప్పటి వరకు  దేశవ్యాప్తంగా 624 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయినట్లు భారతీయ వైద్య మండలి (ఐఎంఏ) తాజాగా వెల్లడించింది.  అత్యధికంగా దిల్లీలో 109 మంది కరోనాకు బలైనట్లు తెలిపింది. బిహార్‌లో 96 మంది డాక్టర్లు మృతి చెందినట్లు ప్రకటన విడుదల చేసింది. కరోనా రెండోదశ వ్యాప్తి  సమయంలో తీవ్రంగా నష్టపోయిన  మహారాష్ట్రలో 23 మంది వైద్యులు అసువులు బాశారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో 79 మంది, రాజస్థాన్‌లో 43 మంది, ఝార్ఖండ్‌లో 39 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 34 మంది, తెలంగాణలో 32 మంది, గుజరాత్‌లో 21 మంది వైద్యులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ఐఎంఏ వెల్లడించింది.

మొదటి దశతో పోల్చుకుంటే రెండో దశలో వైరస్‌ ఉద్ధృతి అధికంగా ఉన్న విషయం తెలిసిందే.  దాదాపు లక్షమంది ప్రాణాలు కోల్పోగా, మరెంతో మంది ఈ మహమ్మారికి గురయ్యారు. బాధితులకు నిత్యం వైద్యసేవలు అందించడంతోపాటు, రోజులో చాలా సమయం వారితోనే గడపాల్సి రావడంతో చాలామంది వైద్యులకు ఈ మహమ్మారి సోకుతోంది. ఇదివరకే ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్న వైద్యులు వైరస్‌ ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

రెండోదశ వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో మెడికల్‌ ఆక్సిజన్‌కు తీవ్ర సమస్య ఏర్పడింది. దీనివల్లే వివిధ ఆస్పత్రుల్లో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. అంతేకాకుండా ఇంటెన్సివ్‌ కేర్‌లో చాలామంది బాధితులకు చికిత్స అందించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే డాక్టర్లకు, నర్సులకు కొవిడ్‌ సోకినట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ పని గంటలు కూడా వైద్యులపై మానసికంగా, ఆరోగ్య పరంగా ప్రభావం చూపిస్తున్నాయని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని