Parliament: ఒక్క నిమిషంలో బిల్లును ఆమోదిస్తారా?.. ఇక్కడేమైనా చాట్ చేస్తున్నారా?

నిమిషాల వ్యవధిలో పార్లమెంట్‌లో ప్రభుత్వం పలు బిల్లుల్ని ఆమోదించడంపై తృణమూల్ కాంగ్రెస్

Published : 02 Aug 2021 16:09 IST

దిల్లీ: నిమిషాల వ్యవధిలో పార్లమెంట్‌లో ప్రభుత్వం పలు బిల్లుల్ని ఆమోదించడంపై తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రీన్ మండిపడ్డారు. ఇక్కడేమైనా చాట్ తయారు చేస్తున్నారా? అంటూ కేంద్రం వైఖరిని తప్పుపట్టారు. పార్లమెంట్ పవిత్రతను ఉల్లంఘిస్తోందని ట్విటర్‌లో ఆరోపించారు. 

‘కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో 12 బిల్లుల్ని ప్రవేశపెట్టింది. హడావుడిగా వాటికి ఆమోదం లభించింది. ఒక బిల్లు ఆమోదించడానికి సగటున ఏడు నిమిషాల కంటే తక్కువ సమయమే కేటాయించారు. ఇక్కడ బిల్లుల్ని ఆమోదిస్తున్నారా? లేక చాట్ తయారు చేస్తున్నారా?’ అంటూ డెరెక్ ఓబ్రీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఒక్కో బిల్లును ఆమోదించిన సమయాన్ని ఒక గ్రాఫ్‌ రూపంలో వివరించారు. దానిప్రకారం.. కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు బిల్లును ఒక్క నిమిషంలో పాస్‌ చేశారు. ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా బిల్లుకు 14 నిమిషాల్లో ఆమోదం పొందింది. గతంలోనూ ప్రభుత్వం హడావుడిగా బిల్లుల్ని ఆమోదించడంపై స్పందిస్తూ.. ‘మనం పిజ్జాలు డెలివరీ చేస్తున్నామా’ అంటూ విమర్శించారు.

జులై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కానీ, పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం, వ్యవసాయ చట్టాలు తదితర అంశాలపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుపట్టడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ అంతరాయాల కారణంగా ఇప్పటివరకూ రూ.133 కోట్ల నష్టం వాటిల్లినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ సమావేశాల్లో లోక్‌సభలో కనీసం 54 గంటలు కార్యకలాపాలు నడవాల్సి ఉండగా.. కేవలం ఏడు గంటలు మాత్రమే పనిచేసిందని తెలపగా, రాజ్యసభ విషయంలో కనీసం 53 గంటలకు 11 గంటలుగా ఉందని పేర్కొంది. ఈ క్రమంలో విపక్షాల వైఖరిని ప్రధాని మోదీతో సహా పలువురు నేతలు విమర్శిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని