అభిశంసన నుంచి గట్టెక్కిన ట్రంప్‌

యూఎస్‌ క్యాపిటల్‌ భవనంపై దాడి ఘటనలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన నుంచి బయటపడ్డారు. రెండో అభిశంసన విచారణలో భాగంగా సెనేట్‌లో ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించగా.. అందులో ట్రంప్‌ నిర్దోషిగా గట్టెక్కారు.

Published : 14 Feb 2021 08:59 IST

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన నుంచి బయటపడ్డారు. రెండో అభిశంసన విచారణలో భాగంగా సెనేట్‌లో ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించగా.. అందులో ట్రంప్‌ గట్టెక్కారు. ట్రంప్‌పై అభిశంసన తీర్మానం నెగ్గేందుకు సెనేట్‌లో మూడింట రెండొంతుల సభ్యుల మద్దతు అవసరం. కానీ, ఆ బలం లేకపోవడంతో ఆయనపై అభియోగాలు వీగిపోయాయి. సెనేట్‌లో మొత్తం 100 మంది సభ్యులు ఉండగా... ట్రంప్ పై పెట్టిన అభిశంసనకు అనుకూలంగా 57 మంది,  వ్యతిరేకంగా 43 మంది ఓటు వేశారు. దీంతో అభిశంసన నుంచి ట్రంప్‌ బయటపడ్డట్లయింది. అయితే ట్రంప్‌కు వ్యతిరేకంగా ఏడుగురు రిపబ్లికన్లూ ఓటేయడం గమనార్హం.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించిన క్రమంలో జనవరి 6న యూఎస్‌ క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో క్యాపిటల్‌పై దాడికి ట్రంపే తన మద్దతుదారులను ప్రేరేపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ట్రంప్‌పై అమెరికన్‌ కాంగ్రెస్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ అభిశంసన విచారణ పలు కీలక మలుపులు తిరిగిన అనంతరం శనివారం తుది దశకు చేరుకుంది. తొలుత క్యాపిటల్‌ భవనం దాడి ఘటనపై  ప్రత్యక్ష సాక్షుల్ని పిలిపించాలనే ప్రతిపాదనకు అనుకూలంగా 55, వ్యతిరేకంగా 45 ఓట్లు పడటంతో సెనేటర్లు గందరగోళంలో పడ్డారు. అనేక తర్జనభర్జనల అనంతరం సాక్షుల విచారణ వదిలిపెట్టి ఓటింగు ప్రక్రియకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని తేల్చకుండా సెనేట్‌ కీలకమైన అంశాలపై ముందడుగు వేసేందుకు అవకాశం లేకపోవడంతో ఇరుపక్షాలు సత్వరం దీన్ని ముగింపు పలికినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి

మయన్మార్‌లో నిరసనలపై ఉక్కుపాదం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని