Updated : 15/12/2020 09:56 IST

ట్రంప్‌ ఇక ఇంటికే..!

అధ్యక్షుడిగా బైడెన్‌ను ఎన్నుకున్న ఎలక్టోరల్‌ కాలేజీ

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నిక అధికారికంగా ఖాయమైంది. రాజ్యాంగ నియమాల ప్రకారం సోమవారం అన్ని రాష్ట్రాల ఎలక్టోరల్‌ కాలేజీలు సమావేశమయ్యాయి. అధ్యక్షుడిగా జో బైడెన్‌ను, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ను ఎలక్టర్లు ఎన్నుకున్నారు. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ స్థానాలకుగానూ బైడెన్‌ 302 కైవసం చేసుకున్నారు.

దీంతో బైడెన్ గెలుపును అడ్డుకునేందుకు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ చేస్తున్న న్యాయపోరాటానికి తెరపడినట్లయింది. పాపులర్‌ ఓట్లు సాధించడంతో పాటు.. ఎలక్టోరల్‌ కాలేజీ మద్దతు సాధించడంలోనూ ట్రంప్‌ విఫలమయ్యారు. గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ఎలక్టోరల్‌ కాలేజీ బైడెన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే శ్వేతసౌధాన్ని వీడతానని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. తాజాగా ఆ పరిణామమూ చోటుచేసుకోవడంతో ఇక ఆయన వైట్‌ హౌజ్‌ను వీడాల్సిందేనని స్పష్టమైంది.  వాస్తవానికి ఎలక్టోరల్‌ కాలేజీ సమావేశమై అధ్యక్షుడిని ఎన్నుకోవడం కేవలం సంప్రదాయం మాత్రమే. ఫలితాల వెల్లడిరోజే తదుపరి అధ్యక్షుడు ఎవరన్నది తేలిపోతుంది. కానీ, ట్రంప్‌ న్యాయపోరాటానికి దిగడంతో చివరి క్షణంలో ఏవైనా అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవచ్చుననే అనుమానాలు ఉండేవి. ఈ నేపథ్యంలోనే ఎలక్టోరల్‌ కాలేజీ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

అధ్యక్ష ఎన్నికల్లో భారీ అవకతవకలు జరిగాయంటూ ట్రంప్‌ తొలి నుంచి ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నాలుగు కీలక రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను రద్దు చేయాలని కోర్టులను ఆశ్రయించారు. కానీ, ట్రంప్‌నకు అన్ని చోట్లా చుక్కెదురైంది. చివరకు సుప్రీంకోర్టులోనూ ఆయన ఆరోపణలు వీగిపోయాయి. అక్రమాలు జరిగాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానాలు తేల్చాయి. దీంతో ట్రంప్‌నకు ఓటమి అంగీకరించడం తప్ప మరోమార్గం లేకుండా పోయింది. ఫలితాలు మార్చే అవకాశాలు క్రమంగా సన్నగిల్లాయి. దీంతో కొన్ని రోజుల క్రితమే అధికార బదిలీకి అంగీకరించారు. అయినా, బహిరంగంగా ఇప్పటివరకు ఓటమిని ఒప్పుకోలేదు. తమ పోరాటం ఇంకా ముగియలేదంటూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

అమెరికా మాజీ విదేశాంగ మంత్రి, 2016 డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో నిలిచి ఓడిపోయిన హిల్లరీ క్లింటన్‌ తాజా ఎలక్టోరల్‌ కాలేజీలో ఉన్నారు. న్యూయార్క్‌ నుంచి ఎలక్టర్‌గా ఎన్నికైన ఆమె బైడెన్‌, కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎలక్టోరల్‌ కాలేజీ వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాపులర్‌ ఓట్ల ఆధారంగానే విజేతను ప్రకటించాలని కోరారు.


నాకు ఓటేయని వారి కోసం మరింత ఎక్కువ శ్రమిస్తా

ఎలక్టోరల్‌ కాలేజీ తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ.. చివరకు ప్రజాస్వామ్యమే గెలిచిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రభుత్వ విధానాలు, సంప్రదాయాలు కఠిన పరీక్ష ఎదుర్కొన్నాయని తెలిపారు. అయినా, వ్యవస్థలు ఏమాత్రం సడలలేదని స్పష్టం చేశారు. పరోక్షంగా ఫలితాల్ని మార్చేందుకు ట్రంప్‌ చేసిన ప్రయత్నాల్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి అమెరికన్‌ గుండెలోకి ఇప్పుడు ప్రజాస్వామ్యం అనే పదం చొచ్చుకుపోయిందన్నారు. అమెరికాలో రాజకీయనాయకులు అధికారం తీసుకోరని.. ప్రజలు వారికి అప్పజెబుతారని గుర్తుచేశారు. ‘‘ప్రజాస్వామ్యం అనే దీపాన్ని అనేక ఏళ్ల క్రితమే అమెరికాలో వెలిగించారు. ఏ మహమ్మారియైనా.. ఎంతటి అధికార దుర్వినియోగమైనా.. ఆ దీపాన్ని ఇక ఆర్పలేవు’’ అని వ్యాఖ్యానించారు. తాను అమెరికావాసులందరికీ.. అధ్యక్షుడిగా ఉంటానన్నారు. తనకు ఓటు వేయని వారి సంక్షేమం కోసం మరింత ఎక్కువ శ్రమిస్తానని వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి..

డ్రాగన్‌ వేగులు

అమెరికాలో తొలి టీకా నర్సుకు

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని