
ట్రంప్ ట్విటర్ షాక్: ఇచ్చింది మనమ్మాయే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాలను, అభిప్రాయాలను ట్విటర్ మాధ్యమంగా ప్రకటించేవారనేది తెలిసిందే. తనపై వచ్చిన ఆరోపణలను కూడా ఆయన ట్విటర్ వేదికగా తిప్పికొట్టేవారు. ఐతే, క్యాపిటల్ భవనంపై ట్రంప్ అభిమానులు దాడి చేసేవిధంగా తన పోస్టుల ద్వారా రెచ్చగొట్టారనే కారణంతో.. ఈ సామాజిక మాధ్యమ దిగ్గజం అధ్యక్షుడి ఖాతాలను శాశ్వతంగా రద్దు చేసింది. మరి ఈ సాహసోపేత నిర్ణయం వెనుక ఉన్నది ఓ తెలుగు మహిళే కావటం గమనార్హం.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత ఖాతాలో పాటు, ‘టీమ్ ట్రంప్’ అనే ఖాతానూ ట్విటర్ నిషేధించింది. ఇక ‘ప్రెసిడెంట్ ట్రంప్’ ప్రభుత్వ ఖాతా కావటంతో నిషేధించలేకపోయినప్పటికీ.. దానిలో పలు వివాదాస్పద ట్వీట్లను తొలగించింది. ఈ చర్యల వెనుక ఆ సంస్థ లీగల్ హెడ్, భారత సంతతికి చెందిన విజయ గద్దే కృషి దాగిఉంది. ‘‘మరిన్ని హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా నివారించేందుకు ట్విటర్ డొనాల్డ్ ట్రంప్ ఖాతాలను పూర్తిగా తొలగించింది. మా నిర్ణయాల అమలుకు సంబంధించిన విధాన విశ్లేషణను మీరు ఇక్కడ చదవవచ్చు’’ అని ఈ సందర్భంగా ఆమె ట్విటర్లో ప్రకటించారు.
హైదరాబాద్‌లో పుట్టి..
హైదరాబాద్‌లో జన్మించిన విజయ చిన్న పిల్లగా ఉండగానే ఆమె కుటుంబం అమెరికాకు వలసవెళ్లారు. అక్కడి టెక్సాస్, న్యూజెర్సీల్లో ఆమె బాల్యం గడిచింది. కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టాను, న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేటును పొందారు. ట్విటర్ కంటే ముందు.. జూనిపర్ నెట్వర్క్స్ , విల్సన్ సోన్సినీ గుడ్‌రీచ్ అండ్ రోసాటీ సంస్థలకు న్యాయసేవలందించారు. కాలిఫోర్నియాలో స్థిర నివాసం ఏర్పర్చుకున్న విజయ .. ప్రస్తుతం ట్విటర్ చీఫ్ లీగల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. అంకుర సంస్థలకు చేయూతనిస్తున్నారు. మహిళలకు సమాన వేతనాల సాధన కోసం కృషిచేసే యాంజెల్స్ అనే సమష్టి పెట్టుబడుల సంస్థ సహ-వ్యవస్థాపకురాలు కూడా.
ట్విటర్ సీఈఓ నీడలా..
ట్విటర్ దశాబ్ద కాలంగా తీసుకున్న పలు కీలక నిర్ణయాల వెనుక విజయ ప్రభావం ఉంది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. రాజకీయ ప్రకటనలను విక్రయించకూడదని ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీని ఒప్పించడంలో విజయ పాత్రే కీలకం. గతేడాది ట్రంప్‌తో జరిపిన చర్చల్లో, 2018లో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా, దలైలామా సందర్శన సమయంలో కూడా ఆమె ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ వెన్నంటే ఉండటం గమనార్హం.
సాధారణ మహిళలాగానే..
అత్యంత శక్తివంతమైన మీడియా ఎగ్జిక్యూటివ్‌గా ఈమెను అమెరికాలోని పత్రికారంగం అభివర్ణిస్తుంది. ప్రపంచ రాజకీయాల్లో పెరుగుతున్న ట్విటర్ పరపతికి అనుగుణంగా.. ఆమె దార్శనికత ఉంటుంది. ఆమె వ్యక్తిగత, కుటుంబ వివరాలు బాహ్యప్రపంచానికి పెద్దగా తెలియదు. శక్తివంతమైన విధాన నిర్ణయాల రూపకల్పనలో కీలక పాత్ర వహించే విజయకు.. సాధారణ మహిళల మాదిరిగా సాహిత్యంలో ఫిక్షన్ అంటే ఇష్టమట. అంతేకాకుండా పర్యటనలు, వంటచేయటం తనకు ఇష్టమైన వ్యాపకాలంటారు. ఖాళీ సమయాన్ని తన చిన్నారితో ఆమెకు అత్యంత ఇష్టమైన వ్యాపకం!
ఇవీ చదవండి..