Poonch encounter: రెండు వారాలైనా ఎన్‌కౌంటర్‌ ముగియలేదెందుకు..?

దాదాపు రెండు వారాలుగా జరుగుతున్న పూంచ్‌ ఎన్‌కౌంటర్లో భద్రతా దళాలకు మరో ఎదురుదెబ్బతగిలింది. ఆదివారం ఉగ్రవాదులు దాడి చేసి ఇద్దరు పోలీసులు, ఒక సైనికుడితో సహా.. బందీగా ఉన్న మరో ఉగ్రవాదిని గాయపర్చారు. భటా-దురయిన్‌ వద్ద

Updated : 24 Oct 2021 11:39 IST

* పూంచ్‌లో మరోసారి ఉగ్రవాదుల పంజా..! 

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు రెండు వారాలుగా జరుగుతున్న పూంచ్‌ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం ఉగ్రవాదులు దాడి చేసి ఇద్దరు పోలీసులు, ఒక సైనికుడితో సహా.. బందీగా ఉన్న మరో ఉగ్రవాదిని గాయపర్చారు. భాతా-దురియా వద్ద ఎన్‌కౌంటర్‌ జరుగుతోన్న ప్రదేశానికి పోలీసులు, సైనికులు కలిసి.. తమ వెంట లష్కరే సంస్థకు చెందిన జియా ముస్తఫా అనే పాకిస్థానీ ఉగ్రవాదిని తీసుకెళ్లారు. ఆ ఉగ్రవాదితో కలిసి అడవిలోని ఓ ఉగ్ర స్థావరం వద్దకు భద్రతా దళాలు చేరుకొన్నాయి. అదే సమయంలో ఆ స్థావరంలో నక్కిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఒక సైనికుడితోపాటు ఉగ్రవాది ముస్తఫా కూడా గాయపడ్డాడు. దీంతో భద్రతా దళాలు కూడా ఎదురుదాడి ప్రారంభించాయి.

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు ఆగస్టులోనే సైన్యం భారీ ఎత్తున గాలింపు చేపట్టింది. గాలింపు బృందాలకు సురాన్‌కోటెలోని డేరాకి గల్లీ ప్రాంతంలో అక్టోబర్‌ 10-11 అర్ధరాత్రి సమయంలో ఉగ్రవాదులతో మొదటిసారిగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక జేసీవోతో సహా ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.  ఈ ప్రదేశం పూంచ్‌-రాజౌరీ జిల్లాల మధ్యలో ఉంటుంది. దీంతో ఉగ్రవాదులు రాజౌరీ వైపు అడవుల్లోకి పారిపోయారు. అక్టోబర్‌ 14న మరోసారి ఉగ్రవాదులు దాడి చేయడంతో నలుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. దీంతో సైన్యం పారా ట్రూపర్లను, డ్రోన్లను కూడా రంగంలోకి దించింది.

కఠనమైన పర్వతాలు.. చిక్కటి అడవులు..!

ఎన్‌కౌంటర్‌ జరుగుతున్న ప్రదేశం భౌగోళికంగా అత్యంత కఠినంగా ఉంది. ఇక్కడ ఏటవాలు పర్వతాలపై పరుచుకొన్న చిక్కటి అడవుల్లో ఉన్న లోయలు, గుహలు, శిఖరాలు ఉగ్రవాదులకు రక్షణ ఇస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇక్కడ 8-10 మంది ముష్కరులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీనికి తోడు ఈ ఉగ్రవాదులు పాక్‌ ఎస్‌ఎస్‌జీ కమాండోల వద్ద శిక్షణ పొందినట్లు భావిస్తున్నారు. ఉగ్రవాదులు చిన్న,చిన్న గ్రూపులుగా విడిపోయి తరచూ స్థావరాలు మారుస్తూ దాడులకు దిగుతున్నారు.

ఎన్‌కౌంటర్‌ ప్రదేశంలోని మెందహార్‌ నార్‌ ఖాస్‌ ప్రాంతంలో పర్వత గుహలు విపరీతంగా ఉన్నాయి. వీటిల్లో ముష్కరులు దాక్కొంటున్నారు. దీంతో సైన్యం కూడా ఈ ఆపరేషన్‌ను అత్యంత జాగ్రత్తగా నిదానంగా చేపట్టాలని నిర్ణయించింది. పూంచ్‌-రాజౌరీ రేంజి డీఐజీ వివేక్‌ గుప్తా దీనిపై మాట్లాడుతూ ‘‘దళాలు ఒక వ్యూహం ప్రకారం ఆపరేషన్‌ చేపట్టాయి. ఇది ముగియడానికి కొంత సమయం పడుతుంది. కచ్చితంగా దళాలే విజయం సాధిస్తాయి’’ అని పేర్కొన్నారు. ఒక్కో ప్రదేశంలో పూర్తిగా కూంబింగ్‌, తనిఖీలు, ఏరివేతను ముగించి మరో ప్రదేశానికి దళాలు చేరుతున్నాయి.

రాజౌరీ-పూంచ్‌ ఉగ్రవాదుల అడ్డగా..

ఈ ఏడాది జూన్‌ నుంచి జమ్ము పరిధిలోని రాజౌరీ-పూంచ్‌ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఊపందుకున్నాయి. వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇక్కడ 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఇక్కడ భౌగోళిక స్వరూపం ఉగ్రవాదులకు రక్షణ ఇస్తోంది. దీంతో 1990ల నుంచే భారీగా విదేశీ ముష్కరులు ఇక్కడికి వస్తున్నారు. అడవుల్లో అక్కడక్కడా ఉండే ఉగ్రవాదులను గుర్తించడం చాలా కష్టం. ఉగ్రవాదులకు స్థానికుల్లో కొందరు సహకరిస్తుండటం కూడా ఆపరేషన్‌ను కష్టతరంగా మారుస్తోంది. ఇప్పటికే ఉగ్రవాదులకు సహకరిస్తున్నారన్న అనుమానంతో దాదాపు 8 మంది స్థానికులను దళాలు అదుపులోకి తీసుకొన్నాయి.

నియంత్రణ రేఖ సమీపంలో నివసించే ప్రజలు విదేశీ ఉగ్రవాదుల సమాచారాన్ని గతంలో చాలా సార్లు దళాలకు ఉప్పందించారు. గతంలో కూడా పూంచ్‌లోని హల్కాక గ్రామాన్ని కూడా స్థానికులు ఇచ్చిన సమాచారంతోనే దళాలు స్వాధీనం చేసుకోగలిగాయన్న విషయాన్ని కశ్మీర్‌ మాజీ  డీజీపీ ఎస్‌పీ వైద్‌ గుర్తుచేశారు. ఈ సారి పరిస్థితి కొంత మారింది.

ఫలితంగా క్షేత్రస్థాయిలో దళాలకు ఇంటెలిజెన్స్‌ సమాచారం లభించడం కష్టమవుతోంది. అందుకే ఎన్‌కౌంటర్‌ మొదలై 14 రోజులు పూర్తవుతున్నా..  ఉగ్రవాదులు కచ్చితంగా ఎక్కడున్నారనే విషయంపై స్పష్టత రావడంలేదు.  ఎన్‌కౌంటర్‌ దృష్ట్యా స్థానిక ప్రజలను ఇళ్లుదాటి బయటకు రావద్దని భద్రతా దళాలు కోరాయి. జమ్ము-రాజౌరీ జాతీయ రహదారి కూడా మూతపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని