IndiGo: గాల్లో ఎదురెదురుగా.. అతి దగ్గరగా వచ్చిన 2 ఇండిగో విమానాలు..!

గగనతలంలో భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన రెండు ఇండిగో (IndiGo) విమానాలు గాల్లోకి ఎగిరిన తర్వాత ఒకదానికొకటి

Published : 20 Jan 2022 02:07 IST

400 మందికి పైగా ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం

దిల్లీ: గగనతలంలో భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన రెండు ఇండిగో (IndiGo) విమానాలు గాల్లోకి ఎగిరిన తర్వాత ఒకదానికొకటి అత్యంత సమీపంగా వచ్చాయి. అయితే రాడార్‌ కంట్రోలర్‌ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు ఎయిర్‌పోర్టు గగనతలంపై జనవరి 9న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణకు ఆదేశించినట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ డీజీసీఏ (DGCA) అధికారులు వెల్లడించారు.

బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు రన్‌వేలు ఉన్నాయి. ఒకటి ఉత్తరం వైపు, మరొకటి దక్షిణం వైపు. సాధారణంగా నార్త్‌ రన్‌వేను టేకాఫ్‌కు, సౌత్‌ రన్‌వేను ల్యాండింగ్‌కు ఉపయోగిస్తున్నారు. అయితే జనవరి 9న రన్‌వేను నిర్వహించే షిప్ట్‌ ఇన్‌ఛార్జ్‌.. టేకాఫ్‌, ల్యాండింగ్‌ రెండింటికీ ఉత్తరం వైపు ఉన్న సింగిల్‌ రన్‌వేను ఉపయోగించాలని నిర్ణయించారు. దక్షిణం వైపు ఉన్న రన్‌వేను మూసివేశారు. అయితే ఈ సమాచారాన్ని సౌత్‌ టవర్‌ కంట్రోలర్‌కు అందించలేదు. 

దీంతో బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్లే ఇండిగో (IndiGo) 6ఈ 455 విమానం సౌత్‌ రన్‌వేపై టేకాఫ్‌ అయ్యేందుకు సౌత్‌ టవర్‌ కంట్రోలర్‌ అనుమతించారు. అదే సమయంలో బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి భువనేశ్వర్‌ వెళ్లే ఇండిగో (IndiGo) 6ఈ 246 విమానం నార్త్‌ రన్‌వేపై టేకాఫ్‌ అయ్యేందుకు నార్త్‌ టవర్‌ కంట్రోలర్‌ కూడా అనుమతినిచ్చారు. ఈ రెండు విమానాలు కూడా దాదాపు 5 నిమిషాల తేడాతో ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరాయి.

దీంతో ఎయిర్‌పోర్టు గగనతలంపై రెండు విమానాలు ఒకదానికొకటి ఎదురెదురుగా అత్యంత సమీపానికి వచ్చాయి. దీన్ని గమనించిన రాడార్‌ కంట్రోలర్‌ వెంటనే పైలట్లను అప్రమత్తం చేశారు. దీంతో విమానాలు దారి మార్చుకున్నాయి. రాడార్‌ కంట్రోలర్‌ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను లాగ్‌బుక్‌లో ఎంటర్‌ చేయకపోవడం గమనార్హం. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (AAI)కు కూడా సమాచారం ఇవ్వలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కోల్‌కతా వెళ్లే విమానంలో 176 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది.. భువనేశ్వర్‌ వెళ్లే విమానంలో 238 మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది కలిపి రెండు విమానాల్లో 400 మందికి పైగా ఉన్నారు.

ఈ ఘటన విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) దృష్టికి రావడంతో దీనిపై విచారణకు ఆదేశించారు. దీనిపై డీజీసీఏ చీఫ్‌ అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా.. ఘటనపై అటు ఇండిగో విమానయాన సంస్థ గానీ, ఇటు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (AAI) గానీ ఇంతవరకూ స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు