Covid-19: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి కొవిడ్‌.. కొత్త వేరియంట్‌పై అనుమానం!

కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ వ్యాప్తి పట్ల యావత్‌ ప్రపంచం ఆందోళన వ్యక్తంచేస్తోంది. డెల్టా రకం కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వేరియంట్‌ దక్షిణాఫ్రికా....

Published : 27 Nov 2021 20:40 IST

బెంగళూరు: కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ వ్యాప్తి పట్ల యావత్‌ ప్రపంచం భయాందోళన వ్యక్తంచేస్తోంది. డెల్టా రకం కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వేరియంట్‌ దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు నగరానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలవరపెడుతోంది. వారికి సాధారణ కొవిడ్‌గానే నిర్ధారణ అయిందని, ఇద్దరినీ క్వారంటైన్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.

నవంబర్‌ 1 నుంచి 26 వరకు మొత్తం 94 మంది దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు రాగా.. వారిలో ఇద్దరికి సాధారణ కొవిడ్‌-19గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. అందువల్ల ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలోని బెంగళూరు రూరల్‌ డిప్యూటీ కమిషనర్‌ కె. శ్రీనివాస్‌ స్పష్టంచేశారు. ఇద్దరినీ క్వారంటైన్‌లో ఉంచినట్టు చెప్పారు. శాంపిల్స్‌ని తదుపరి పరీక్షల కోసం పంపినట్టు వివరించారు. ప్రపంచంలో 10 హైరిస్క్‌ దేశాల నుంచి నవంబర్‌ 1 నుంచి 26 వరకు బెంగళూరుకు మొత్తంగా 584 మంది వచ్చారని వెల్లడించారు.

నెగిటివ్‌ వచ్చినా 7 రోజులు బయటకు రావొద్దు!

దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌ వంటి దేశాల్లో గత వారం రోజులుగా కొత్త వేరియంట్లు వెలుగు చూస్తున్న వేళ విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసినట్టు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్‌ తెలిపారు. ఆయా దేశాల నుంచి నగరానికి వచ్చిన వారికి కొవిడ్ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ ఉన్నప్పటికీ మళ్లీ పరీక్ష నిర్వహించాలని సూచించామన్నారు. తమ పరీక్షల్లో కొవిడ్ నెగిటివ్‌గా వచ్చిన వారినే బయటకు పంపాలని సూచించారు. నెగిటివ్‌ వచ్చినా సరే ఇంటి వద్ద వారు ఏడు రోజుల పాటు ఉండాలని, ఆ తర్వాత మళ్లీ కొవిడ్ పరీక్ష చేయించుకొని నెగిటివ్‌ వచ్చాకే బయటకు వెళ్లాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని