‘మా దేశంలో తిరుగుబాటు కుట్రను భగ్నం చేశాం’

రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య కొన్నాళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కొంతమంది రష్యన్ల సహకారంతో వచ్చే వారంలో ఉక్రెయిన్‌లో తిరుగుబాటు కోసం పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు ఆ దేశ అధ్యక్షుడు...

Published : 26 Nov 2021 22:10 IST

కీవ్: రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య కొన్నాళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కొంతమంది రష్యన్ల సహకారంతో వచ్చే వారంలో ఉక్రెయిన్‌లో తిరుగుబాటు కోసం పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఈ తిరుగుబాటు ప్రణాళికకు సంబంధించిన ఆడియో రికార్డింగ్‌ ఆధారాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు. ‘మాకు రష్యన్ ఫెడరేషన్, సైన్యాల నుంచి మాత్రమే కాదు.. అంతర్గతంగానూ సవాళ్లు ఉన్నాయి. డిసెంబరు 1, 2 తేదీల్లో దేశంలో తిరుగుబాటుకు కుట్ర పన్నినట్లు సమాచారం అందింది’ అని జెలెన్స్కీ విలేకరులతో చెప్పారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు ఈ కుట్రతో మాకెలాంటి సంబంధం లేదని రష్యా తెలిపింది.

భారీ ఎత్తున బలగాల మోహరింపు..

నాటో కూటమిలో చేరాలనుకుంటున్న ఉక్రెయిన్.. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా నుంచి భారీ ఎత్తున మందుగుండు సామగ్రి, క్షిపణులను దిగుమతి చేసుకుంది. పొరుగు దేశమైన రష్యా దీన్ని తీవ్రంగా తప్పుపట్టింది. దీంతోపాటు ఉక్రెయిన్‌ సరిహద్దు సమీపంలో కొన్నాళ్లుగా భారీ ఎత్తున బలగాలను మోహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రష్యా నుంచి దాడి జరిగే అవకాశాలూ ఉన్నాయని ఉక్రెయిన్‌తోపాటు అమెరికా, నాటో దళాలు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా మద్దతు గల వేర్పాటువాద శక్తులు మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందనీ పేర్కొన్నాయి. అయితే రష్యా మాత్రం దీన్ని కొట్టిపారేసింది. మరోవైపు రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చలకు తమ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యెర్మాక్ త్వరలో రష్యా ప్రతినిధులను సంప్రదించనున్నట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని