‘మయన్మార్‌లో హింసకు ముగింపు పలకాలి’

మయన్మార్‌లో కొనసాగుతున్న హింసాత్మక పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చి మయన్మార్‌లో మిలిటరీ అణచివేతకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేసింది.

Published : 16 Mar 2021 23:39 IST

జెనీవా: మయన్మార్‌లో కొనసాగుతున్న హింసాత్మక పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చి మయన్మార్‌లో మిలిటరీ అణచివేతకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

‘మయన్మార్‌లో గత ఆదివారం సైన్యం కాల్పుల్లో పదుల సంఖ్యలో నిరసనకారులు మరణించడం ఆందోళనకరం. ఆ దేశంలో మిలిటరీ అణచివేతకు ముగింపు పలకడానికి అంతర్జాతీయ సమాజం సమష్టిగా పనిచేయాలి. నిరసనకారులను చంపడం, అక్రమంగా వారిని అరెస్టులు చేసి హింసించడం ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడమే అవుతుంది. ప్రజాస్వామ్య పాలన కోసం నిరసనలు చేస్తున్న మయన్మార్‌ ప్రజలకు అండగా ఉంటాం’ అని గుటెరస్‌ తెలిపారు. మరోవైపు ఐరాసలో మయన్మార్‌ ప్రత్యేక రాయబారి క్రిస్టిన్‌ ష్రానర్‌ బుర్గేనర్‌ తమ దేశంలోని సైన్యం సాగిస్తున్న హింసను తీవ్రంగా ఖండించారు. ఐరాస భద్రతా మండలితో పాటు, అంతర్జాతీయ సమాజం సైతం హింసకు ముగింపు పలకాలని పిలుపునిచ్చినప్పటికీ అదే పరిస్థితులు కొనసాగించడం మానవ హక్కుల ఉల్లంఘనే అని ఆయన పేర్కొన్నారు. వైద్య సిబ్బందిపై దాడులు, మౌలిక సౌకర్యాలను నాశనం చేయడం ద్వారా శాంతియుత పరిస్థితులు లేకుండా పోతున్నాయన్నారు.

మయన్మార్‌లో ఫిబ్రవరి1 నుంచి ఆ దేశ సైన్యం దేశ పాలన పగ్గాలను చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రాజకీయ నేత ఆంగ్‌సాన్‌ సూకీని సైన్యం నిర్బంధించింది. దీంతో అప్పటి నుంచి దేశంలో తిరిగి ప్రజాస్వామ్య పాలన నెలకొల్పాలంటూ ప్రజలు నిరసనలు చేస్తున్నారు. సైన్యానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నవారిపై పాలకులు హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సైనిక కాల్పుల్లో గత ఆదివారం పదుల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందారు. మరోవైపు ఇప్పటివరకు 2వేల మందిని పోలీసులు అరెస్టులు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని