Published : 10/08/2021 01:47 IST

Climate Change: ఉష్ణోగ్రతలు తగ్గాలంటే 30 ఏళ్లు..

ఐరాస ‘ఐపీసీసీ’ నివేదికలో వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘భూ వాతావరణం వేగంగా వేడెక్కుతోంది.. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.. భారీ వర్షాలు, వడగాడ్పులు తరచూ సంభవిస్తున్నాయి..  మానవ చర్యలే ఈ మార్పులకు ప్రధాన కారణమ’ని ఐరాసకు చెందిన ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమెట్‌ ఛేంజ్‌(ఐపీసీసీ) తన నివేదిక(అసెస్‌మెంట్‌ రిపోర్ట్‌)లో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల బృందం సోమవారం దీన్ని విడుదల చేసింది. కార్బన్‌ డైఆక్సైడ్‌, గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను నియంత్రిస్తే.. మంచి మార్పులు తీసుకురావచ్చని, కానీ.. అన్ని దేశాలు ఇందుకు అంగీకరించాలని పేర్కొంది. ఒకవేళ ఈ ఏడాది చివరి నాటికి ముందుకొచ్చినా.. వాతావరణ ఉష్ణోగ్రతల స్థిరీకరణకు 20 నుంచి 30 ఏళ్లు పట్టొచ్చని అభిప్రాయపడింది. మరోవైపు ఈ నివేదికను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌.. వాతావరణ శాస్త్రంపై వివరణాత్మక సమీక్షగా అభివర్ణించారు. ‘కోడ్‌ రెడ్‌ ఫర్‌ హ్యూమానిటీ’గా చెప్పుకొచ్చారు. ఐపీసీసీలో 195 దేశాలు ఉండగా.. వాటిలో భారత్‌ ఒకటి. 
ఐపీసీసీ నివేదికలోని అంశాలు..
* వాతావరణం వేగంగా వేడెక్కిపోతోంది. బాంబ్‌షెల్‌ నివేదిక ప్రకారం 2030 వరకు సాధారణ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌పెరిగే ప్రమాదం ఉంది. 2018లో అంచనా వేసిన దానికంటే ఒక దశాబ్దం ముందే సంభవించడం గమనార్హం.
* ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. 1901- 1971 మధ్య సగటు రేటు ఏడాదికి 1.3 మిల్లీమీటర్లు ఉండగా.. 2006- 2018 మధ్య 3.7 మి.మీలకు చేరింది. మొత్తం 1901- 2018 మధ్య చూసుకుంటే సముద్ర మట్టాలు 0.20 మీటర్లు పెరిగాయి.
* అనేకప్రాంతాల్లో తరచూ వడగాడ్పులు సంభవిస్తున్నాయి. 1950ల నుంచి వీటి సంఖ్య, తీవ్రత పెరిగిపోయింది. మరోవైపు శీతల పవనాలు తగ్గుముఖం పట్టాయి.
* గ్లోబల్‌ వార్మింగ్‌కు నగరాలే ప్రధాన కేంద్రాలుగా మారాయి. వేడిని అవి పట్టి ఉంచడం ఇందుకు ప్రధాన కారణం. జల వనరులు, వృక్షసంపద కనుమరుగవుతుండటంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది.
* 50 ఏళ్లకోసారో, పదేళ్లకోసారో సంభవించే భారీ వర్షాలు, అతి ఉష్ణోగ్రతలు, కరవులు.. తరచూ వస్తున్నాయి. తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోంది. ఇవి అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి. భిన్న ఉత్పాతాలు ఒకేసారి సంభవిస్తున్నాయి. మరోవైపు విపత్తులకు ప్రధాన కారణాలు కనుక్కోవడం కష్టతరంగా మారుతోంది.
* వాతావరణ మార్పు, నాణ్యత.. నాణేనికి రెండు వైపుల్లాంటివి. రెండింటి సమస్యలను కలిసి పరిష్కరించడం ద్వారా గణనీయ ఫలితాలు పొందవచ్చు.
*. శిలాజ ఇంధనాల వినియోగం, గ్రీన్‌హౌస్‌ వాయువులను ఉత్పత్తి చేసే కార్యకలాపాలను పూర్తిగా కట్టడి  చేయడం ద్వారా ఈ శతాబ్ది చివరినాటికి గ్లోబల్‌ వార్మింగ్‌ను నియంత్రించవచ్చని ఐపీసీసీ తన నివేదికలో పేర్కొంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని