భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నాం

భారత ఔషధరంగం అవసరాలను అర్థం చేసుకున్నామని.. వీటిపై వచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని జో బైడెన్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Published : 21 Apr 2021 01:42 IST

వ్యాక్సిన్‌ ముడిపదార్థాల నిషేధంపై స్పందించిన వైట్‌హౌస్‌

వాషింగ్టన్‌: వ్యాక్సిన్‌ తయారీకి కావాల్సిన ముడి పదార్థాల ఎగుమతిపై విధించిన ఆంక్షలు సడలించే విషయమై అగ్రరాజ్యం అమెరికా నుంచి స్పష్టమైన హామీ రాలేదు. కానీ, భారత విన్నపాన్ని సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని వెల్లడించింది. అమెరికా ఆంక్షల కారణంగా భారత్‌లో వ్యాక్సిన్‌ ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. దీనిపై వ్యాక్సిన్‌ సంస్థలతో పాటు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు అమెరికా నేడు స్పందించింది. భారత ఔషధరంగం అవసరాలను అర్థం చేసుకున్నామని.. వీటిపై వచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. అయితే, ముడిపదార్థాలపై ఎటువంటి నిషేధం లేదని, కేవలం దేశీయ వినియోగానికి ప్రాధాన్యతనిచ్చే ఓ చట్టం అమలులో ఉండడం వల్లే కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని అభిప్రాయపడింది.

అమెరికాలో ‘రక్షణ చట్టం (డీపీఏ)’ అమల్లో ఉండడం వల్ల టీకాల తయారీకి కావాల్సిన కొన్ని ముడిపదార్థాల ఎగుమతిపై నిషేధం కొనసాగుతోంది. ఆ చట్టం ద్వారా వ్యాక్సిన్‌లు, పీపీఈ కిట్ల వంటి ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో అక్కడి ఫార్మా కంపెనీలకే ప్రాధాన్యత ఉంటుంది. దీంతో విదేశాలకు ముడి పదార్థాల ఎగుమతికి ఆటంకం ఏర్పడింది. అమెరికా తీసుకున్న ఆ నిర్ణయం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ కేంద్రంగా ఉన్న భారత్‌పై తీవ్రంగా పడింది. ముఖ్యంగా భారత్‌లో భారీ ఎత్తున టీకా ఉత్పత్తి చేస్తోన్న సీరం ఇన్‌స్టిట్యూట్‌కి తీవ్ర అడ్డంకిగా మారింది.

ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తయారీలో అవసరమయ్యే ముడి పదార్థాల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. టీకా ఉత్పత్తిని వేగవంతం చేయాలంటే నిషేధం ఎత్తివేయాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనాను అంతం చేయడంలో మనమంతా కలిసి ముందుకు సాగాలంటే నిషేధం ఎత్తివేయక తప్పదని పూనావాలా ఈమధ్యే ట్విటర్‌ ద్వారా అమెరికా అధ్యక్షుడికి విన్నవించారు. ఈ విషయన్ని అమెరికాలోని భారత రాయబారి తరంజిత్‌ సింగ్‌ కూడా వైట్‌హౌస్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇలా అమెరికాపై ఒత్తిడి పెరగడంతో స్పందించిన వైట్‌హౌస్‌.. వ్యాక్సిన్‌ ముడిపదార్థాలపై ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టంచేసింది. కేవలం అమెరికా ఫార్మా కంపెనీలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే విధంగా నిబంధనలు ఉన్నాయని పేర్కొంది. ఏదేమైనప్పటికీ భారత్‌ విజ్ఞప్తులను పరిశీలనకు తీసుకుంటామని..త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని