క్యాపిటల్‌ భవనంలోనే బైడెన్‌ ప్రమాణ స్వీకారం!

క్యాపిటల్‌ భవనంలో భద్రతా బలగాలు ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశాయి.

Published : 12 Jan 2021 01:59 IST

వాషింగ్టన్‌: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు తాను హాజరు కాబోనని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించగా.. హాజరవుతానంటూ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ స్పష్టం చేశారు. మాజీ అధ్యక్షులు జార్జ్‌ బుష్‌, బిల్‌ క్లింటన్‌ వంటి ఎందరో ప్రముఖులు కూడా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరుకానున్నారు. అమెరికా క్యాపిటల్‌ భవనంలో చోటుచేసుకున్న దాడి సంఘటన.. భద్రతా దళాల సంసిద్ధతపై అనుమానాలను రేకెత్తిస్తోంది. కాగా, ఈ ఉదంతం తమకు హెచ్చరికగా పనిచేసిందని.. రానున్న ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని లోపరహితంగా నిర్వహిస్తామని అధికార వర్గాలు అంటున్నాయి. ఇందుకుగానూ తాము చేసిన ఏర్పాట్లను ఈ విధంగా వివరించాయి..

ప్రమాణ స్వీకారం ఎక్కడంటే..

కరోనా ఆంక్షల కారణంగా నాటి కార్యక్రమాలు కుదింపునకు గురయ్యాయి.  వేడుకలు పరిమితమయ్యీయి. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్, ఉపాధ్యక్ష పదవిని చేపట్టబోయే కమలా హారిస్‌లు అదే క్యాపిటల్‌ భవనంలోని వెస్ట్‌ ఫ్రంట్‌ ప్రాంతంలో అధికారాన్ని చేపట్టాల్సి ఉంది. కాగా,  ట్రంప్‌ అభిమానులు పోలీసు రక్షణను ఛేదించి మరీ లోపలికి ప్రవేశించిన ప్రదేశం కూడా ఇదే కావటం గమనార్హం. నాటి ఘటనలో ప్రదర్శనకారులు ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం అప్పటికే ఏర్పాటు చేసిన మంచెలు, మెట్ల వరుసలను కూడా ధ్వంసం చేశారు.

రాజీలేని భద్రత

బుధవారం నాటి అనూహ్య సంఘటనతో క్యాపిటల్‌ భవనంలో భద్రతా బలగాలు ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశాయి. జాతీయ స్థాయి ప్రత్యేక ప్రాముఖ్యత గల (ఎన్‌ఎస్‌ఎస్‌ఈ) 59వ అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని.. జాతీయ నిఘా సంస్థ సీక్రెట్‌ సర్వీస్‌తో సహా డజన్ల కొద్దీ భద్రతా సంస్థలు కంటి మీద రెప్ప వేయకుండా పహారా కాస్తాయి. పది లక్షల మంది హాజరైనా వారిని అదుపులో ఉంచగల మిలిటరీ, పోలీసు బలగాలు ఈ సందర్భంగా విధుల్లో ఉంటారు. వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూయార్క్‌, న్యూజెర్సీ, మేరీలాండ్‌, డెలావేర్‌ రాష్ట్రాల నుంచి సుమారు 6200 మంది అదనపు భద్రతా సిబ్బంది.. క్యాపిటల్‌ పోలీసులకు సహాయంగా వాషింగ్టన్‌లో నెల రోజుల పాటు మకాం వేయనున్నారు. ఎక్కేందుకు సాధ్యం కాని విధంగా బ్లాక్‌ మెటల్‌తో చేసిన కంచెలను క్యాపిటల్‌ భవనం చుట్టూ హుటాహుటిన ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రహదారుల మూసివేత, దారిమళ్లింపు వ్యూహాలు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చాయి. ఓ సంవత్సర కాలంగా అమెరికా రహస్య సేవా విభాగం-యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌.. నేషనల్‌ స్పెషల్‌ సెక్యూరిటీ ఈవెంట్‌ (ఎన్నెస్సెస్సీ) తదితర ప్రభుత్వ భద్రతా సంస్థల సమన్వయంతో నిరంతరం కృషి చేస్తోంది.

దాడులు ప్రజాస్వామ్య పునాదుల్ని కదల్చలేవు..

అగ్రరాజ్య అధ్యక్షుడికి ఆహ్వానం పలికే ఈ కార్యక్రమానికి.. మామూలుగా ఐతే రెండు లక్షల మంది హాజరవుతారు. కాగా ఈసారి చట్టసభల సభ్యులు కాకుండా.. వారితో పాటు మరొకరికి మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి లభించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్లు ఏమీ క్లోబుచర్‌, రాయ్‌ బ్లంట్‌  సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. దీనిని నిరాటంకంగా నిర్వహించటం ఖాయమని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా ఈ తరహా దాడులు ప్రజాస్వామ్య పునాదుల్ని కదల్చలేవని.. అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిరూపిస్తామంటున్నారు. జనవరి 6 నాటి వైఫల్యం మరోసారి పునరావృతం కాకుండా.. ఆహూతులకు రాజీలేని భద్రత కల్పించటమే అగ్రరాజ్యం ప్రస్తుత కర్తవ్యమని వారు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

ట్రంప్‌కు ట్విటర్‌ షాక్‌.. ఇచ్చింది తెలుగమ్మాయే!

ట్రంప్‌ ఓ చెత్త అధ్యక్షుడు.. ఆర్నాల్డ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని