70 నుంచి 85శాతం మందికి టీకాలు వేస్తేనే..

అమెరికాలో త్వరలో రోజుకు 10 లక్షల మందికి కరోనా వైరస్ టీకాలు అందజేయగలమని ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అంచనా వేశారు.

Published : 06 Jan 2021 16:42 IST

రోజుకు 10లక్షల మందికి టీకాలు వేయగలం: ఫౌచీ

వాషింగ్టన్: అమెరికాలో త్వరలో రోజుకు 10 లక్షల మందికి కరోనా వైరస్ టీకాలు అందజేయగలమని ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అంచనా వేశారు. అక్కడ కొన్ని వారాల క్రితం ఫైజర్, మోడెర్నా టీకాలకు ఆమోదం లభించి టీకా కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అది నెమ్మదిగా నడుస్తుండటంపై ప్రజలు, వైద్యాధికారులు నిరాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాము త్వరలోనే వేగం పుంజుకుంటామంటూ ఫౌచీ వెల్లడించారు. అంతేకాకుండా వైరస్ విజృంభణ కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. 

‘ఎప్పుడైనా భారీ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు, అవాంతరాలు ఉంటూనే ఉంటాయి. టీకా కార్యక్రమం వేగం పుంజుకుంది. రోజుకు ఐదు లక్షల మందికి టీకా అందుతోంది. ఈ కార్యక్రమం ఇంకా ఊపందుకున్న తరవాత రోజుకు 10 లక్షలు అంతకంటే ఎక్కువ మందికే టీకాలు అందిస్తామని అంచనా వేస్తున్నాను. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ మొదటి 100 రోజుల్లో 100 మిలియన్ల టీకాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది చాలా వాస్తవికమైన లక్ష్యం’ అని ఫౌచీ అభిప్రాయపడ్డారు. అలాగే దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలంటే 70 నుంచి 85 శాతం మంది అమెరికన్లకు టీకాలు వేయాల్సి ఉంటుందని వెల్లడించారు.

ఇదిలా ఉండగా..అగ్రదేశం అమెరికా కరోనా వైరస్‌తో తీవ్రంగా ప్రభావితమైంది. అక్కడ 2 కోట్ల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. 3,65,000 పైచిలుకు మరణాలు సంభవించాయి. ఇటీవల ఆ దేశంలో రోజూవారీ మరణాలు నాలుగు వేలకు చేరువయ్యాయి. ఆసుపత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. అందుకే వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు వైద్యాధికారులు టీకా కార్యక్రమం వేగవంతం చేయడంపై దృష్టిసారించారు. 

ఇవీ చదవండి:

చైనా తీరుపై WHO అసహనం!

99.97 లక్షల మంది కోలుకున్నారు
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని