US strike: అమెరికా నిఘా వైఫల్యం.. ఏమైందంటే?

అగ్రరాజ్యం అంచనాలు తప్పిందా? నిఘాలో వైఫల్యం చెందిందా? ఇటీవల అఫ్గాన్‌లో చివరిసారి జరిపిన డ్రోన్‌ దాడిలో ఉగ్రవాదులుగా పొరపాటు పడి సామాన్యుల ప్రాణాలు బలిగొందా? అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ వాదనలకు...

Published : 12 Sep 2021 01:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్రరాజ్యం అంచనాలు తప్పిందా? నిఘాలో వైఫల్యం చెందిందా? ఇటీవల అఫ్గాన్‌లో చివరిసారి జరిపిన డ్రోన్‌ దాడిలో ఉగ్రవాదులుగా పొరపాటు పడి సామాన్యుల ప్రాణాలు బలిగొందా? అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ వాదనలకు బలం చేకూర్చేలా న్యూయార్క్‌ టైమ్స్‌ తాజాగా ఓ పరిశోధనాత్మక కథనం వెలువరించింది. ఐసిస్‌ ఉగ్రవాదుల బదులు ఏ పాపం ఎరుగని ఓ సామాన్యుడిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగిందని అందులో పేర్కొంది. ఆగస్టు 26న కాబుల్‌ విమానాశ్రయం వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికులతోపాటు సుమారు 200 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తర్వాత 29న ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఓ రాకెట్‌ దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా అదే రోజు కాబుల్‌లో డ్రోన్‌ దాడి చేపట్టి, ఒకరిని అంతమొందించినట్లు అమెరికా అధికారులు అప్పట్లో ప్రకటించారు. అఫ్గాన్‌ గడ్డపై అమెరికా జరిపిన చివరి దాడి అదే. కానీ.. ఇందులో ఓ అమాయకుడిని బలిగొన్నట్లు తాజా కథనంలో వెల్లడైంది.

అసలేం జరిగిందంటే..

కాబుల్‌ విమానాశ్రయానికి సమీపంలో నివసిస్తున్న జెమారీ అహ్మదీ(43).. కాలిఫోర్నియాకు చెందిన ఓ సంస్థలో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌. ఆగస్టు 29న ఉదయం పై అధికారి తన ల్యాప్‌టాప్‌ తీసుకురమ్మని చెప్పడంతో.. సంస్థకు చెందిన తెల్లరంగు కారులో బయల్దేరారు. మధ్యలో వేర్వేరు చోట్ల ఇద్దరిని ఎక్కించుకున్నారు. మరోచోట పై అధికారికి చెందిన ల్యాప్‌టాప్‌ తీసుకున్నారు. తరువాత సదరు అధికారి ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు.. అప్పటికే ఎయిర్‌పోర్ట్‌ లక్ష్యంగా రాకెట్‌ దాడి జరిగింది. ఈ దాడికి కేంద్రంగా అమెరికన్‌ బలగాలు అనుమానించిన ప్రాంతం.. ఈ ఇంటికి సమీపంలోనే ఉంది. దాడి సైతం.. అహ్మదీ ప్రయాణిస్తున్న కారు మోడల్‌ లాంటిదే మరోదాని నుంచి జరిగింది. అప్పటికే సదరు వాహనం కోసం వెతుకుతున్న బలగాలకు.. ఆయన కారు కనిపించింది. దీంతో డ్రోన్‌ సాయంతో దాన్ని ట్రాక్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో.. అహ్మదీ తన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నీళ్ల సీసాలు నింపుకొని, కారులో పెట్టి, తిరిగి ఇంటికి బయల్దేరారు. ఆయన పరిసరాల్లో నీటి సరఫరా నిలిచిపోవడంతో.. ఇక్కడినుంచే తీసుకెళ్తున్నారు. కానీ.. కారులో పేలుడు పదార్థాలు నింపినట్లు అమెరికా బలగాలు పొరబడ్డాయి. ‘ఆ సమయానికి అహ్మదీ గురించి మాకు ఇంకా పెద్దగా తెలియదు. కానీ.. కారుతో విమానాశ్రయంలోని దళాలకు ముప్పు పొంచి ఉందని భావించిన’ట్లు అమెరికా అధికారులు న్యూయార్క్‌ టైమ్స్‌కు చెప్పారు. సాయంత్రం 4.50కి అతను ఇంటికి చేరుకున్న సమయంలో కారుపై డ్రోన్‌తో దాడి చేశారు.

వారంతా నిర్దోషులు: మృతుడి సోదరుడు

సదరు కారుపై డ్రోన్ దాడి అనంతరం.. రెండో పేలుడు సంభవించినట్లు గత వారం అమెరికా ఆర్మీ జనరల్‌ మార్క్ మిల్లీ చెప్పారు. కానీ.. అక్కడ రెండో పేలుడు జరిగినట్లు ఆధారాలు లేనట్లు తేలింది. పరిసరాలూ ధ్వంసం కాలేదని వెల్లడైంది. ఈ ఘటనలో ముగ్గురు సామాన్యులు మృతి చెందినట్లు అమెరికా చెబుతున్నా.. ఏడుగురు చిన్నారులతోసహా 10 మంది పౌరులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ కథనంపై పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ‘అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ దాడి క్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంది. కచ్చిత సమాచారంతోనే ఇది చేపట్టినట్లు మార్క్ మిల్లీ మాకు తెలిపారు. ఏదేమైనా.. ఎయిర్‌పోర్టు వద్ద మరిన్ని దాడులు జరగకుండా ఈ ఘటన అడ్డుకున్నట్లు మేం నమ్ముతున్నామ’న్నారు. కానీ.. ఈ ఘటనలో మృతులంతా నిర్దోషులని అహ్మదీ సోదరుడు రోమల్‌ అహ్మదీ వాపోయారు. ‘అతను(అహ్మదీ) ఉగ్రవాది అని మీరు అంటున్నారు. కానీ అతను అమెరికన్ల కోసం పనిచేశాడు. నా సోదరుడు, కుమార్తె, అల్లుళ్లను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిపార’ని కన్నీటి పర్యంతమయ్యారు. అప్పటికే అహ్మదీ.. అమెరికాలో పునరావాసం కోసం దరఖాస్తు చేసుకున్నాడని వెల్లడించారు. అహ్మదీతోపాటు ఆయన ఇద్దరు సోదరులు, వారి కుటుంబాలు కలిసే నివసిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని