Fauci: అమెరికా టీకాలతో ఆ వేరియంట్లకు చెక్‌

అమెరికాలో ఇప్పటికే వినియోగంలో ఉన్న కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిపై సమర్థంగా పనిచేస్తున్నాయని ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుడు ఆంటోనీ ఫౌచీ తెలిపారు. ఈ వ్యాక్సిన్లు బీ.1.617, బీ.1.168 రకాల నుంచ.......

Updated : 19 May 2021 09:50 IST

అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ

వాషింగ్టన్‌: అమెరికాలో ఇప్పటికే వినియోగంలో ఉన్న కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిపై సమర్థంగా పనిచేస్తున్నాయని ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుడు ఆంటోనీ ఫౌచీ తెలిపారు. ఈ వ్యాక్సిన్లు బీ.1.617, బీ.1.168 రకాల నుంచి పాక్షికంగా లేదా పూర్తిగా రక్షణ కల్పిస్తాయని స్పష్టం చేశారు. ఈ టీకాలు తీసుకున్న వారికి వైరస్‌ను తటస్థీకరించడానికి సరిపడా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని తెలిపారు. దీనిపై జరిగిన పరిశోధనా ఫలితాలను ఈ సందర్భంగా పంచుకున్నారు.

వ్యాక్సినేషన్‌ను బలపరుస్తూ గత కొన్ని రోజులుగా వెలువడుతున్న అనేక అధ్యయనాల్లో ఇదీ ఒకటని ఫౌచీ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంంలో ప్రతిఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచించారు. అమెరికాలో ఇప్పటి వరకు ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను భారీ ఎత్తున కొనుగోలు చేసినప్పటికీ.. వాటిని నిల్వకే పరిమితం చేశారు.

భారత్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వేరియంట్లపై ఫైజర్‌, మోడెర్నా టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు అమెరికాకు చెందిన ఎన్‌వైయూ గ్రాస్‌మాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, లాంగోన్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు. అమెరికాలో ఈ రెండు వ్యాక్సిన్లను తీసుకున్న వ్యక్తుల నుంచి నమూనాలను సేకరించి వాటిని ల్యాబ్‌లో భారత్‌లో వెలుగుచూసిన బి.1.617, బి.1.618 వేరియంట్లతో కలిపి పరీక్షించినట్లు పేర్కొన్నారు. ఫైజర్‌, మోడెర్నా టీకాలు రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని వెల్లడించారు. తాజాగా ఫౌచీ చేసిన ప్రకటనతో ఈ అధ్యయనాన్ని ఆయన ధ్రువీకరించినట్లైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని