ఉత్తరాఖండ్‌: బొమ్మలకు అంత్యక్రియలు

వారి సంప్రదాయాల ప్రకారం మృతుల బొమ్మలకు అంత్యక్రియలకు నిర్వహిస్తున్నారు.

Updated : 29 Feb 2024 13:35 IST

58కి చేరిన మరణాలు..

తపోవన్‌: జల ప్రళయం చోటుచేసుకున్న ఉత్తరాఖండ్‌లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం మరో రెండు మృతదేహాలు లభించాయి. దీంతో మృతుల  సంఖ్య 58కి చేరింది. వీరిలో 29 మందిని గుర్తించినట్లు జిల్లా కలెక్టర్‌ స్వాతి బధౌరియా తెలిపారు. కాగా, మరో 146 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉంది. తపోవన్‌ ప్రాంతంలోని 1.7 కిలోమీటర్ల పొడవున్న ఎన్టీపీసీ హైడ్రోపవర్‌ ప్రాజెక్టు  సొరంగంలో ఇప్పటి వరకూ పదకొండు మృతదేహాలను వెలికితీశారు. సొరంగంలో భారీగా పేరుకుపోయిన బురద వల్ల గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటి వరకు 146 మీటర్ల మేర బురదను తొలగించామని కలెక్టర్‌ తెలిపారు. రిషి గంగ డ్యామ్, రేని గ్రామాల వద్ద కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.

ఇదిలా ఉండగా, ఘటన జరిగి పది రోజులవుతున్నా గల్లంతైన వారి ఆచూకీ లభించకపోవటంతో.. వారు తిరిగి వస్తారనే ఆశలు క్రమంగా అడుగంటుతున్నాయి. ఇక వారి మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం కూడా క్షీణిస్తుండటంతో మృతుల బొమ్మలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి జౌన్సారీ తెగల సంప్రదాయం ప్రకారం చనిపోయిన వారికి 14 రోజుల్లోగా అంత్యక్రియలు నిర్వహించాలని చెబుతున్నారు. మృతదేహాలు లభించకపోవడంతో.. వారి ఆకృతితో ఉన్న బొమ్మలకు అంత్యక్రియలు జరిపిస్తున్నట్టు వారు శోకతప్త హృదయాలతో వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని