Corona: చేతిలో చేయి వేసుకొని.. నిమిషం వ్యవధిలోనే భార్యాభర్తల మృతి!

ఆయన వయస్సు 59.. ఆమె వయస్సు 66. వీరి దాంపత్యం అన్యోన్యంగా సాగింది. కానీ కరోనా మహమ్మారి​ వారి జీవితానికి శాపంలా మారింది......

Published : 29 Sep 2021 02:05 IST

మిషిగన్​: అతడి వయస్సు 59.. ఆమె వయస్సు 66. వీరి దాంపత్యం అన్యోన్యంగా సాగింది. కానీ కరోనా మహమ్మారి​ వారి జీవితానికి ఓ శాపంలా మారింది. కొవిడ్‌ సోకడంతో ఇద్దరూ ఒకేసారి ఆసుపత్రిలో చేరారు. కొన్నాళ్లు చికిత్సపొందిన ఆ దంపతులిద్దరూ చేతిలో చేయి వేసుకుని ఒక్క నిమిషం వ్యవధిలోనే ఈ లోకాన్ని వీడారు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని మిషిగన్‌కు చెందిన కాల్‌ డన్హమ్​ (59), లిండా(66) ఈ నెల తొలి వారంలో అనారోగ్యంతో కొంత ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కుటుంబంతో కలిసి ట్రిప్​కు వెళ్లారు. అక్కడ వారికి జ్వరం, జలుబు తీవ్రమైంది. మూడు రోజులకే ట్రిప్​ను అర్ధాంతరంగా ముగించుకొని ఇంటికి చేరారు.

ఆ ట్రిప్​ నుంచి వచ్చిన కొన్ని రోజులకే దంపతులిద్దరూ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కాగా వారిద్దరికీ కొవిడ్​ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యులు కొన్ని రోజుల పాటు వారిని వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతుండగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం 11:07 గంటలకు కాల్​ డన్హమ్ మృతిచెందగా.. ఆ తర్వాత ఒక్క నిమిషానికే.. అంటే 11:08 గంటలకు భార్య లిండా కూడా తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో వారిద్దరు చేతిలో చెయ్యి వేసుకునే ఉన్నారు. కొవిడ్​పై పోరాటం కోసం ప్రతి ఒక్కరు టీకా తీసుకోవాలని ప్రోత్సహించే కాల్​, లిండా మృతితో స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి. వీరిద్దరూ టీకా రెండు డోసులూ తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని