బాస్కెట్‌బాల్‌ ఆడిన ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ 

ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా సాధారణంగా ఎప్పుడూ వీల్‌ఛెయిర్‌లోనే కన్పించే భాజపా ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ తాజాగా క్రీడాకారిణిగా మారారు. బాస్కెట్‌బాల్‌ ఆడారు

Published : 02 Jul 2021 23:09 IST

భోపాల్‌: ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా ఎప్పుడూ వీల్‌ఛైర్‌లోనే కన్పించే భాజపా ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ తాజాగా క్రీడాకారిణిగా మారారు. బాస్కెట్‌బాల్‌ ఆడారు. ఆడటమే కాదు.. ఎంతో అనుభవమున్న క్రీడాకారిణిగా బాల్‌ను సరిగ్గా నెట్‌లో వేసి శభాష్‌ అన్పించారు.

ఎంపీ ప్రజ్ఞా గురువారం భోపాల్‌లోని సాకేత్‌ నగర్‌లో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడ బాస్కెట్‌బాల్‌ గ్రౌండ్‌లో కొందరు బంతితో ఆడుతూ కన్పించడంతో ఆమె అక్కడకు వెళ్లారు. బంతిని తీసుకుని కోర్టులో ఆడుకుంటూ వెళ్లి నెట్‌లోకి విసిరారు. అది సరాసరి బాస్కెట్‌లో పడటంతో అక్కడున్నవారంతా ఎంపీని చప్పట్లతో అభినందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా ఈ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘‘ఎంపీ సాధ్వీని ఇప్పటివరకు నేడు వీల్‌ఛెయిల్‌లోనే చూశారు. కానీ ఈ రోజు ఆమె ఎంతో ఉల్లాసంగా బాస్కెట్‌బాల్‌ ఆడుతూ కన్పించారు. ఆమె ఎల్లప్పుడూ ఇలాగే ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుతున్నా’’ అని పేర్కొన్నారు. 

దీనిపై ఎంపీ సోదరి ఉపమా సింగ్‌ స్పందిస్తూ.. ప్రజ్ఞాకు ఇది చాలా చిన్న విషయమని అన్నారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో ఆమె బ్యాచిలర్‌ డిగ్రీ చేశారని, జైలుకు వెళ్లే ముందువరకు ఎంతో ఫిట్‌గా ఉండేవారని చెప్పుకొచ్చారు. కానీ జైల్లో శారీరకంగా, మానసికంగా గాయపర్చడంతో ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. 2008 మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ప్రజ్ఞా ఠాకూర్‌ నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని